దేవుని బొమ్మ ఉన్న ఉంగరాన్ని పెట్టుకోవచ్చా ?

www.mannamweb.com


మనలో చాలామంది ఇష్టదైవాన్ని రూపుకట్టించుకొని కుడిచేతి ఉంగరం వేలికి తొడుక్కుంటారు . కుడిచేతికి దేవుని బొమ్మతో ఉంగరం ఉంటే అన్నం తినేప్పుడు ఎంగిలి అంటుకుంటుంది కదా ? అదేవిధంగా ఉంగరాన్ని మనం సర్వకాల సర్వావస్థల్లోనూ ధరించే ఉంటాము కదా ? మరి అలా ధరించవచ్చా ? దానివల్ల భగవంతునికి అపచారం కలుగుతుందేమోనని భావన.

‘భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా’ అని భావన చేసిన అన్నమాచార్యులు ఆ శ్రీకృష్ణుని రమ్యమైన , భవ్యమైన పాద దర్శనాన్ని చేసుకోగలిగారు . యద్భావం తత్భవతి అన్నట్టు భావనతోనే మన అనుమానాలు సగం సత్యమై నిలుస్తుంటాయి .

ఏ రాయైనా, ఏ రాశి వారికి అని జ్యోతిష్యులు చెప్పేదాకా తెలియదు కనుక, తెలిసీ తెలియకుండా ఏరాయి పడితే ఆ రంగురాయిని ధరించవద్దని పెద్దల ఉవాచ కనుకా, ఈ బాధలన్నీ లేకుండా ఎంచక్కా దేవుని బొమ్మని చెక్కించుకొని ఉంగరం వెలికి తొడిగేసుకుని మురిసిపోయేవారు కొందరు. ఆ బంగారములోనో , వెండిలోనో తమ ఇష్ట దైవమునే పొదువుకుంటే , నిత్యం ఆస్వామి కరుణ తమతో ఉంటుందనే విశ్వాసం మరికొందరిది .

అసలు ఎందుకు పెట్టుకోవాలి అని ఆలోచన చేయండి. ఆ ఉంగరం చుస్తే తప్పా, భగవంతుడు గుర్తుకు రారు అనుకునే వారు, భోజనం చేసేప్పుడు తీసేయండి. ఎందుకంటే, వారు ఆ ఉంగరం లో దేవుని చూస్తున్నారు. ఆయన పట్ల అపచారం అని భావించడం సహేతుకమే.

ఏదేమైనా , ముందే చెప్పుకున్నట్టు , మీ మనసులో భోజనం చేసేప్పుడు ఆయనకీ ఎంగిలి అంటుకుంటుంది అనిపించిందనుకోండి , తీసేయండి. భోజనం చేశాక మళ్ళీ పెట్టుకోండి . అదే స్వామికి ఇది నివేదన , ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను ఆనుకున్నారనుకోండి , చక్కగా వేలికి ఉంచుకొనే భోజనం చెయ్యండి . రత్నాంగుళీయకం ధరించినపుడు, ఈ అనుమానం రాదు.

ఇక్కడ నాకు షిరిడీ సాయి బాబా వారి కథ ఒకటి గుర్తొస్తోంది . బాబా మసీదులో వెలిగించిన దీపాలకి నూనెకి బదులు నీళ్ళని వాడారు. ఆయనకీ చముఱైనా నీరయినా ఒక్కటే . ఆయన అనుకుంటే ఎందులోఅయినా ఉంటారు . చరాచర సృష్టంతా తానె అయినప్పుడు ఏది నీరు , ఏది చమురు ? అలాగే ఏ అవస్థ భగవంతునిది ? ఏది కాదు ? సర్వకాల సర్వావస్థల యందూ , ఆ స్వామి మనలోనే ఉన్నారు . దేహమేకదా దేవాలయం .

అలాంటప్పుడు ఆ సనాతన దైవాన్ని వేలికి ధరించినా, ధరించకపోయినా లాభము , నష్టము లేవు . కాబట్టి అంతా మన భావనలోనే ఉంది . భావన చేయగలిగితే, పరమాత్మనే దర్శనం చేసుకోవచ్చు ! వేలికున్న ఉంగరానిదొక లెక్కా !!