ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత: సీఎం చంద్రబాబు

ఇద్దరు పిల్లలు (Two Childrens) లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) పోటీ చేయకుండా చట్టం తెస్తామని, భవిష్యత్‌ను ఊహించి అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేశామని, పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, నీరు, జనాభాను సమతుల్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు. సంపద సృష్టిస్తామని, ప్రజల ఆదాయం పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను గోదావరిలో కలిపిందని, ఇస్రో మరో ఘనత సాధించిందని, అంతరిక్షంలో స్పేస్ డాకింగ్ విజయవంతం చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

టెక్నాలజీ వల్ల కొత్త టెన్షన్‌లు వస్తున్నాయని, కనీసం కుటుంబ సభ్యులుతో కూడా గడపలేక గొడవలు వస్తున్నాయని, ఒకప్పుడు వాటి గురించే తాను కూడా పదే పదే చెప్పానని సీఎం చంద్రబాబు అన్నారు. మన జనాభా సంఖ్య తగ్గిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హత అనే నిబంధన తీసుకువస్తామని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు చేయకపోతే మనం వెనుకబడుతామన్నారు. యూపీ, బీహార్‌తో పోలిస్తే మన దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతున్నారు.. ఐటీ రంగంలో భార్యా భర్తలు ఉద్యోగులు అయితే… పిల్లలును కనడంపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ విషయంలో ఇప్పుడు తాను కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చానన్నారు. ఉపాధ్యాయులు ఇటువంటి అంశాలను పిల్లల తల్లిదండ్రులుకు వివరించాలని, సమాజంలో పిల్లలు కనే విషయంలో పాజిటివ్‌గా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. మన జనాభాను పెంచుకోవడం ద్వారా 2047లో మన వాళ్లే అన్నిచోట్లా రాణించే వీలు ఉంటుందని, పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడాలనిని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఇకపై ఏ పథకం అమలుచేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదివరకు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమని, ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని, అంతకంటే ఎక్కువ సంఖ్య ఉంటే అంతకుమించి ఇచ్చేవాళ్లం కాదని అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేస్తూ చట్టం తెచ్చామని, అది అప్పటి పరిస్థితి అని అన్నారు. కానీ ఇప్పుడు జనాభా కావాలని, ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హత కల్పిస్తామని అన్నారు. 2026లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌-టీఎఫ్‌ఆర్‌)… 2051 నాటికి అది 1.07కి తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయన్నారు. ఇది ప్రమాదకరమని, ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే… జనాభా సక్రమ నిర్వహణ సాధ్యపడుతుందన్నారు.