చాట్‌జీపీటీ.. ChatGpt.. చాట్‌జీపీటీ.. ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. కృత్రిమ మేధ సాంకేతికతో ఓపెన్ ఏఐ (open AI) తీసుకొచ్చిన ఈ చాట్‌బాట్‌పై ఆధారపడటం పెరిగింది. సందేహాలు, సమాచారం కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. చిక్కు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు.. సుదీర్ఘ వ్యాసాల సారాంశాన్ని నాలుగు ముక్కల్లో ఈ చాట్‌జీపీటీ చెప్పగలదు. అంతటి సామర్థ్యం కలిగిన చాట్‌జీపీటీని సరిగా వాడుకోవాలే గానీ మీ జీవితాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చంటున్నారు టెక్ నిపుణులు.
నైపుణ్యం పెంచుకొనేందుకు
ఏ ప్రశ్న అడిగినా చిటికెలో సమాధానం అందించగలదు చాట్‌జీపీటీ. ఈ చాట్‌బాట్ సాయంతో మీ ప్రశ్నలకు వివరంగా సమాధానాలు రాబట్టొచ్చు. మీ ఆలోచనలు దాని ముందుంచి ‘వినూత్నంగా రాసేందుకు సాయపడు’ అనేలా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే చాలు.. చకచక ఇట్టే స్క్రీన్‌పై మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. కొత్త భాషలు నేర్చుకోవాలన్నా, కోడింగ్ సమయంలో ఏదైనా సమస్య ఎదురైనా మీకొక సహాయకుడిగా పనిచేస్తుంది.
మార్నింగ్ మోటివేషన్
ఉదయం లేవగానే ఓ మంచి మోటివేషన్ అందించే కోట్ వినాలనిపిస్తే వెంటనే చాట్‌జీపీటీని అడిగేయండి. మీ కోసం స్వయంగా ఓ ప్రేరణ కలిగించే వాక్యాన్ని చెబుతుంది. ఆదర్శవంతమైన కథలు, వ్యక్తుల జీవితాల గురించి చెబుతుంది. ఎప్పుడూ పాజిటివ్‌గా, లక్ష్యంపై మనసు కేంద్రీకరించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. లక్ష్యం వైపు పయనించే వారు చాట్‌జీపీటీని ఇలా తెలివిగా వాడుకోవచ్చు.
సంక్లిష్టమైన వాటికీ..
మనమేదైనా అంశం గురించి చదువుతున్నప్పుడు అది అర్థం కాకపోతే.. చాట్‌జీపీటీని అడగొచ్చు. అందుకు తగిన ప్రాంప్ట్ ఇస్తే ఆ అంశం గురించి పూర్తిగా వివరిస్తుంది. ఒకవేళ అప్పటికీ అర్థం కాకపోతే ఉదాహరణలతో మీ సందేహాలు తీరుస్తుంది. ఏదైనా పరిశోధనకు సంబంధించిన అంశమైనా, క్లిష్టమైన టాపిక్ అయినా అర్థమయ్యేలా సమాధానం చెబుతుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వారు చాట్‌జీపీటీని ఇలా ఉపయోగించుకోవచ్చు.
ఆలోచనల్లోనూ తోడుగా
ఏదైనా ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నా, ప్రయాణ ఆలోచన చేస్తున్నా లేదా కొత్తగా ఏదైనా వ్యాపారంలోకి అడుగుపెట్టాలన్నా.. మీ మెదడుకు తోడుగా చాట్‌జీపీటీని సాయం కోరొచ్చు. ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు ఏయే ప్రాంతాలకు వెళ్లొచ్చు? అక్కడేం చూడొచ్చు? ఉన్న ప్రయాణ సౌకర్యాలేంటో చాట్‌జీపీటీ తెలియజేస్తుంది. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు.. ఎలా ప్రారంభించాలి? దానికి ఏమేం అవసరం? వంటి సలహాలనూ అడిగి తెలుసుకోవచ్చు.
జోక్ చెప్పవా?
ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ.. ఆఫీస్‌లో బాస్ తిట్టాడనీ.. అనుకున్నట్టుగా ఏమీ జరగడం లేదనీ.. ఒక్కోసారి మూడ్ మారిపోతుంటుంది. అలాంటి సమయంలో ‘ఓ జోక్ చెప్పవా?’ అని చాట్‌జీపీటీని అడిగి చూడండి. జోక్ చెప్పడంతో పాటూ, మీరు కోరితే ఒత్తిడి తగ్గించే సూచనలూ, సలహాలను కూడా ఇస్తుంది.
ఉద్యోగ జీవితంలో..
ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టడంలోనూ చాట్‌జీపీటీ మీకు సాయపడుతుంది. రెజ్యూమె ప్రిపరేషన్‌లో మీకో గైడ్‌లా వ్యవహరిస్తుంది. ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కొనేలా సన్నద్ధులను చేస్తుంది. అంతేనా.. లీడర్‌షిష్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి స్కిల్స్‌ను నేర్చుకోవడంలోనూ చాట్‌జీపీటీ ఉపయోగపడుతుంది.
ఇ-మెయిల్ రాయడంలోనూ, కవితలను అల్లడంలోనూ చాట్‌జీపీటీది అందెవేసిన చేయి. ఏదైనా భాషలోని అంశాన్ని ఇతర భాషల్లోకి తర్జుమా కూడా చేయగలదు. కాబట్టి ఎవరి అవసరాలను తగ్గట్టుగా వారు చాట్‌జీపీటీని తెలివిగా ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని చెబుతున్నారు టెక్ నిపుణులు.