వినియోగాన్ని పెంపొందించడం ద్వారా వృద్ధికి బాటలు వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచాలని కన్సల్టింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అభిప్రాయపడింది. రూ.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలనీ సూచించింది. గత ఏడాది బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నా, రూ.1.4 లక్షల కోట్లు తక్కువగా ఈ ఆర్థిక సంవత్సరాన్ని ముగించే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ రూ.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని నిర్దేశించుకోవాలని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నయ్యర్ అభిప్రాయపడ్డారు. అప్పులకు ఒక పరిమితి నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు.
2024 ఏప్రిల్- నవంబరు మధ్య కేంద్ర ప్రభుత్వం రూ.5.13 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని సాధించింది. ఇది బడ్జెట్ అంచనా (రూ.11.11 లక్షల కోట్ల)ల్లో 46 శాతానికి సమానం.
వాస్తవిక అంచనాల ప్రకారం మూలధన వ్యయాన్ని నిర్దేశించుకోవాలని, మరీ అధిక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆర్థిక లోటు పెరిగి – వడ్డీరేట్లు అధికమవుతాయని ఆమె విశ్లేషించారు.
కొవిడ్ పరిణామాల అనంతరమే
కొవిడ్-19 పరిణామాల తరవాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం అధిక మూలధన వ్యయాన్ని బడ్జెట్లో ప్రతిపాదిస్తూ వస్తోంది. 2020-21లో రూ.4.39 లక్షల కోట్లు, 2021-22లో రూ.5.54 లక్షల కోట్లు, 2022-23లో 7.5 లక్షల కోట్లు, 2023-24లో 10 లక్షల కోట్లు చొప్పున మూలధన వ్యయం ఉండటం గమనార్హం.
ఆర్థిక లోటు 4.8%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు 4.8 శాతంగా ఉండొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది 4.5 శాతానికి పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాల కంటే తక్కువగా నమోదైనా, మూడో త్రైమాసికం నుంచి మెరుగుపడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందన్నది ఇక్రా అంచనా.
వినియోగం అధికమవ్వాలి
ప్రస్తుతం గ్రామీణ ప్రాంత వినియోగం స్థిరంగా కనిపిస్తున్నా, పట్టణ ప్రాంత ప్రజల వినియోగం హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం దీనికి ప్రధాన కారణమని ఆదితి వివరించారు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గితే, పట్టణాల్లో వినియోగం పెరిగి వృద్ధి రేటు అధికమయ్యే అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలని సూచించారు. ‘అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రజల వినియోగం తగ్గిపోయింది. అందువల్ల పన్ను భారాన్ని కొంత తగ్గించడం సరైన చర్యే అవుతుంది’ అని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం మరీ తగ్గిపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పన్ను రేట్లు తగ్గించడం కానీ లేదా పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా కానీ ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని వివరించారు.