ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాది మూడు విడతల్లో రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేస్తుంది.
ఈసారి ఖాతాల్లో రూ.6500?
అన్నదాత సుఖీభవ పథకం కింద మిగిలిన రూ.14 వేలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తారు. అంటే ప్రతి విడతలో రైతులకు రూ.6500 జమ చేయనున్నారు. అయితే పీఎం కిసాన్, ఫార్మర్ రిజిస్ట్రీ డేటా ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది.
ఈసారి పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
పీఎం కిసాన్ డబ్బులు
జూన్ నెలలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకు అందించనున్నారు.
ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో జూన్ నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఫోన్ లోనే సులభంగా
అయితే అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? మీరే సులభంగా ఫోన్ లో తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వెబ్ సైట్ లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
- అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ పై క్లిక్ చేయండి.
- హోంపేజీలోని ‘Know Your Status’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- రైతు ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత ‘Search’ ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ చూపిస్తుంది.
- స్టేటస్ ‘Approved’ అని ఉంటే అన్నదాత సుఖీభ పథకానికి అర్హులు
రైతు సేవా కేంద్రంలో
మే నెల 20లోగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రంలో రైతుల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలతో వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేసి పైస్థాయి అధికారులకు పంపిస్తారు.
జిల్లా స్థాయిలో ఈ జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్‌ల్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం మరోసారి ఈ వివరాలను ఆర్‌జీఎస్‌కు పంపుతారని సమాచారం.