Cleaning Teeth Techniques: ప్రతి రోజు ఉదయం లేవగానే పళ్లు తోముకోవడం మంచి పద్ధతి. ఎందుకంటే దంతాలు శుభ్రంగా ఉంటేనే రోజంతా దుర్వాసన లేకుండా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే బ్రష్ చేసుకోవడంలో చాలా మంది సోమరితనం ప్రదర్శిస్తుంటారు. ఏదో అలా పైపైన బ్రష్ చేసి మమ అనేస్తారు. కానీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసన, పిప్పళ్లు, పంటి నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల బ్రష్ చేసుకునే సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రష్ చేసుకునే విధానంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. బ్రష్ పై పేస్ట్ అప్లై చేసుకోగానే దానిని చిగుళ్ల కింద వరకు తోమాలి. దంతాల పైకి, కిందకు శుభ్రం చేసుకోవాలి. అనంతరం దవడ పళ్ల కింద బ్రష్ తో దంతాలను శుభ్రం చేయాలి. లోపల కూడా దంతాలను పై నుంచి కింద వరకు నీటిగా తోముకోవాలి.
దవడ పళ్ల వద్ద 45 డిగ్రీలుగా బ్రష్ ను అటు ఇటు తిప్పుతూ శుభ్రం చేయాలి. బ్రష్ చేసుకోవడం వల్ల దంతాల మధ్యలో క్లీన్ అవుతుంది. అంతేకాదు చిగుళ్లకు కూడా మసాజ్ అయ్యేలా బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దంతాలు రంగు మారకుండా, దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. మరోవైపు బ్రష్ లను 2 నుంచి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. 6 నెలలకు ఒకసారి డెంటిస్టును సంప్రదించి, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి.
చక్కెర పదార్థాలు, పొగాకు, సిగరెట్, మద్యం వంటివి తీసుకోవడం వల్ల దంతాలు పాడవుతాయి. మరోవైపు మూడు పూటలా తిన్న తర్వాత దంతాలను, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.