అవినీతి కేసులో శ్రీలంక మాజీ దేశాధ్యక్షుడి కుమారుడు అరెస్టు

అవినీతి కేసులో.. శ్రీలంక మాజీ దేశాధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషితా రాజపక్స(Yoshitha Rajapaksa)ను అరెస్టు చేశారు. ఓ ప్రాపర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజపక్స పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


బెలియట్టా ప్రాంతంలో తన స్వంత ఇంట్లో మాజీ నేవీ ఆఫీసర్ అయిన యోషితాను అదుపులోకి తీసుకున్నారు. 2015 కన్నా ముందు.. తండ్రి మహింద రాజపక్స అధికారంలో ఉన్న సమయంలో.. యోషితా ఓ ప్రాపర్టీ కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మహిందకు ముగ్గురు కుమారులు ఉన్నారు. దాంట్లో యోషితా రెండో వ్యక్తి. ఇదే ప్రాపర్టీ అంశంలో మరో మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కూడా విచారించారు. తనకు సెక్యూర్టీ కల్పించాలని కోరుతూ ప్రాథమిక హక్కుల కింద మహింద రాజపక్స సుప్రీంకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడిని అరెస్టు చేయడం శ్రీలంకలో సంచలనంగా మారింది.

గత ఏడాది నవంబర్‌లో అనుర కుమార దిశనాయకే.. శ్రీలంక అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహింద పెద్ద కుమారుడు నమల్ రాజపక్సను కూడా మరో ప్రాపర్టీ కేసులో పోలీసులు విచారించారు. మహింద రాజపక్స పదివీకాలం.. 2005 నుంచి 2015 మధ్య.. ఎవరు అవినీతికి పాల్పడినట్లు తేలినా వాళ్లను అదుపులోకి తీసుకోనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.