గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. విద్యార్ధులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా గురుకులాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్లను మే 21 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సంయుక్త కార్యదర్శి ఎండీ ఉబేదుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు మాత్రమే మే 21 నుంచి 30లోపు సంబంధిత గురుకుల పాఠశాలలల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరై ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు. విద్యార్ధులు తమ ర్యాంకు కార్డులతోపాటు విద్యా, కులా, ఆదాయ సర్టిఫికెట్లు తమతోపాటు తెచ్చుకోవాలని తెలిపారు.


నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాలకు మే 22 వరకు గడువు

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (NCET) ప్రాథమిక ఆన్సర్ కీని ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. ఈ కీ పై అభ్యంతరాలకు తెలిపేందుకు మే 22వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కాగా నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025ను ఏప్రిల్‌ 29న నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలోని 13 భాషల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరిగింది.

ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)లో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కాలేజీలతో సహా వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఈ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో మొత్తం 6,100 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లోనూ అడ్మిషన్లు పొందవచ్చు. అందుకు ఆయా సంస్థలు కౌన్సెలింగ్‌ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సు సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.