ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నప్పటికీ పెట్రోలుతో నడిచే వాహనాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మంచి పనితీరుతో ఇవి ప్రజల నమ్మకాన్ని పొందాయి. అలాంటి వాటిలో సుజుకీ యాక్సెస్ స్కూటర్ ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల హవాలోనూ దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైడ్ కనెక్ట్ పేరుతో సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రత్యేక డిజైన్, ఆకర్షణీయమైన రంగులతో ఆకట్టుకుంటోంది.
మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో సుజుకి యాక్సెస్ ఒకటి. దీనిలో కొత్త ఎడిషన్ ను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా విడుదల చేసింది. దీని ధరను రూ.1,01,900 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. 4.2 అంగుళాల కలర్ డీఎఫ్ టీ డిస్ ప్లేలో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ అనే కొత్త రంగులో దీన్ని తీసుకువచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్న మోటాలిక్ మ్యాట్ నంబర్ 2, మోటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ అనే రంగుల్లో కూడా అందుబాటులో ఉంది.
కొత్త స్కూటర్ లో 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి చెందిన అన్ని 125 మోడళ్లలోనూ దీన్నే వినియోగిస్తున్నారు. ఈ ఇంజిన్ నుంచి 6500 ఆర్పీఎం వద్ద 8.31 బీహెచ్ పీ శక్తి, 5000 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ ఎం గరిష్ట టార్కు విడుదల అవుతుంది. ఇంజిన్ ఫ్యూయల్ ఇంజెక్షన్, సీవీటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, కిక్ – ఎలక్ట్రిక్ స్టార్టర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతర ప్రత్యేకతల్లోకి వెళితే స్కూటర్ ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. వన్ పుష్ సెంట్రల్ లాక్ సిస్టమ్, ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఆకట్టుకుంటున్నాయి. సుజుకీ ఇంజిన్ కిల్ స్విచ్, యూఎస్ బీ పోర్టు, ముందు భాగంలో యుటిలిటీ పాకెట్లు, రెండు హుక్కులు, సీటు కింద రెండు హుక్కులు, స్టోరేజీ తదితర ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్కూటర్ 46 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోంది. టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ సస్పెన్షన్, ముందు భాగంలో డ్రమ్, డిస్క్ బ్రేకులు, వెనుక వైపు డ్రమ్ బ్రేకులు అమర్చారు. ఈ స్కూటర్ ఫ్యూయల్ ట్యాంకు కెపాసిటీ 5.3 లీటర్లు. బరువు సుమారు 106 కిలోలు. కాగా.. సుజుకి మోటారు సైకిల్ ఇండియా ప్రైవేటు లిమిడెట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రాకపోకలకు వీలుగా ఉండేలా కొత్త స్కూటర్ ను తయారు చేశామన్నారు. ట్రాఫిక్ రద్దీలోనూ చాలా సులువుగా డ్రైవింగ్ చేసుకోవచ్చన్నారు. కలర్ టీఎఫ్ టీ డిజిటల్ డిస్ ప్లే, ఆకర్షణీయమైన రంగుతో అందంగా తీర్చిదిద్దాం. విశ్వసనీయత, సౌకర్యం, సామర్థ్యానికి ఈ స్కూటర్ నిదర్శనంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.