పెరుగు, యోగార్ట్ చూడటానికి ఒకేలా ఉంటాయి. అయితే రెండు ఒకటి కాదు. ఇవి రెండు విభిన్నమైన పాల ఆధారిత ఉత్పత్తులు. చాలామంది పెరుగును విదేశాల్లో యోగర్ట్ అంటారేమో అని అనుకుంటారు.
కానీ అసలు విషయం వేరు. ఈ రెండింటి ఆకారం, నిర్మాణం, రుచులు, పోషక విలువల్లో కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అవేంటో సవివరంగా తెలుసుకుందాం.!
పెరుగు సంగతి మనకు తెలిసిందే. కాచిన పాలు చల్లారాక… కాస్త పెరుగు వేస్తే… కొన్ని గంటల్లో పాలు మొత్తం పెరుగు అయిపోతాయి. ఇందుకు కారణం.. పెరుగులో ఉండే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పాలను తినేసి.. పెరుగుగా మార్చేస్తుంది. కొంతమంది నిమ్మరసం, వెనిగర్ వంటివి కూడా వేసి.. పెరుగుగా మార్చుతారు.యోగర్ట్ అనేది మరో రకం. దీన్ని మన ఇళ్లలో తయారుచెయ్యలేం. అంటే.. దీని తయారీలో కృత్రిమ యాసిడ్స్ (artificial acids) కలుపుతారు. అంటే ఇది కృత్రిమ ప్రక్రియ ద్వారా తయారయ్యేదని చెప్పవచ్చు.
అయితే ఈ రెండింటికి సరైన ఉష్ణోగ్రత ఉంటేనే మంచి రుచి ఆకృతి ఉంటుందనేది గ్రహించాలి. ఇక్కడ పెరుగులో తక్కువ మొత్తంలో బ్యాక్టీరియా ఉంటుంది. అది కూడా ఒకే రకమైన జీవ కుటుంబానికి చెందినది కాదు. పెరుగులో రకరకాల సూక్ష్మక్రిములు (Lactic acid bacteria) ఉంటాయి. ప్రత్యేకించి ఇదీ అని ఏదీ ఉండదు. అన్నీ కలిసి ఉంటాయి. యోగర్ట్ తయారీలో అలా కాదు.. ప్రత్యేకమైన బ్యాక్టీరియాను వాడుతారు. అయితే చాలామందికి పెరుగు నచ్చదు.
అంటే.. వారికి పెరుగులోని లాక్టోజ్ పడదు. అలర్జీ వస్తుంది. అలాంటి వారు యోగర్ట్ బెటర్. అందులోనూ గ్రీక్ స్టైల్ యోగర్ట్ వారికి సరిగ్గా సెట్ అవుతుంది. గ్రీక్ యోగర్ట్ చిక్కగా ఉంటుంది. దేశవాళీ పెరుగు ఎప్పుడూ ఒకే ఫ్లేవర్‌తో ఉంటుంది. పుల్లగా, కమ్మగా ఉంటుంది. యోగర్ట్ అలా కాదు.. అందులో రకరకాల పండ్ల ఫ్లేవర్స్ కలుపుతారు. అంటే స్ట్రాబెర్రీ, మ్యాంగో, చాక్లెట్ ఫ్లేవర్ ఇలా. అందుకే యోగర్ట్ పిల్లలకు బాగా నచ్చుతుంది. యోగర్ట్‌ని రెడీ టూ ఈట్ ప్యాక్స్‌లో అమ్ముతుంటారు.
ఏది బెటర్ అంటే..?
పెరుగు, యోగర్ట్ రెండింటిలోనూ పోషకాలు ఉంటాయి. పెరుగు మన శరీరానికి చలవ చేసి.. వేడిని తగ్గిస్తుంది. మసాలాల వల్ల బాడీలో పెరిగే వేడిని పెరుగు సరిచేస్తుంది. యోగర్ట్‌లో ప్రోటీన్ ఎక్కువ. పెరుగుతో పోల్చితే దాదాపు డబుల్ ఉంటుంది. రెండింటిలోనూ మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి ముసలివారిలో కీళ్లనొప్పులు, అస్థియోపోరోసిస్ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.
ముఖ్యంగా పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు బలం ఇస్తుంది. ఈ రెండింటిలోనూ ఏదో ఒకటి మాత్రమే తినాలి అనుకుంటే.. అప్పుడు బెటర్ ఏది అనుకుంటే.. పెరుగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. యోగర్ట్ వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే రెండింటిలో ఏది వాడినా సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు.