మాజీ మంత్రి డీఎల్ కీలక నిర్ణయం-మైదుకూరు ఎమ్మెల్యేగా వీరికి.. కడప ఎంపీగా వారికి మద్దతు..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీయే కూటమిగా ఉమ్మడి అభ్యర్ధులను నిలబెట్టడంతో రాష్ట్రంలో ఈసారి భారీగా క్రాస్ ఓటింగ్ జరగబోతోంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులుగా కూటమి నిలబెట్టిన స్ధానాల్లో క్రాస్ ఓటింగ్ ఎలాగో తప్పదు. అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో సైతం భిన్న పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ తప్పేలా లేదు. కడప జిల్లాల్లో తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటర్లకు ఇవాళ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా గతంలో తాను పలుమార్లు గెలిచిన మైదుకూరు సీటులో ఎవరికి ఓటేయాలో, కడప ఎంపీగా ఎవరికి ఓటు వేయాలన్న దానిపై డీఎల్ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ఆసక్తికరంగా ఉంది. మైదుకూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ కు ఓటేయాలని డీఎల్ పిలుపునిచ్చారు. అయితే కడప లోక్ సభ స్ధానంపై మాత్రం పరోక్షంగా ఓ పిలుపు ఇచ్చారు.


కడప లోక్ సభ సీటులో వివేకం సినిమా చూసి ఓటేయాలంటూ డీఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అంటే ఈ సినిమాలో చూపించినట్లుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత బాధితులుగా మారిన ఆయన కుటుంబం మద్దతిస్తున్న వైఎస్ షర్మిలకు ఓటేయాలని డీఎల్ పరోక్షంగా చెప్పినట్లయింది. అసలే కడప లోక్ సభ సీటులో అవినాష్ వర్సెస్ షర్మిల వార్ కొనసాగుతున్న నేపథ్యంలో డీఎల్ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.