కుటుంబ గౌరవాలు.. వైసీపీ నాయకులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?

వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతలు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. పార్టీకి భారీ ఓటమి ఎదురైన తర్వాత..


వరుసగా కేసులు ఎదురవుతున్న వేళ ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. తమ కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉందని.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. కానీ ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ప్రవర్తించారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళింది కొందరు వైసీపీ నేతలు. కనీసం వయసు కూడా చూడకుండా… చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన నేతలు ఉన్నారు. నిండు సభలో ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును దారుణంగా అవమానించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆయన బోరున విలపించారు. ఆయన బాధను సైతం ఎద్దేవా చేస్తూ ప్రచారం చేసుకున్నారు.

ఇప్పుడు తప్పులు కనిపిస్తున్నాయా?
అయితే ఇప్పుడు వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ తప్పులను ఒప్పుకుంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్( Jogi Ramesh) అయితే బహిరంగంగానే తన ప్రకటన జారీ చేశారు. ఆరోజు చంద్రబాబు సతీమణి ప్రస్తావన తీసుకురావడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పేనని చెప్పుకొచ్చారు. ఇది యావత్ మహిళలు వ్యతిరేకించారని చెప్పారు. చివరకు తన భార్య సైతం తనను నిలదీసిందని.. అసెంబ్లీకి వెళ్తోంది ఇలాంటి అడ్డగోలు పనులకా అంటూ నిలదీసినంత ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సతీమణిని అవమానించడాన్ని తప్పు పట్టారని గుర్తు చేశారు. అయితే ఇదే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై వందలాదికారులతో దండయాత్రకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన కుటుంబం పై కూడా మాట్లాడారు. ఇప్పుడు అదే జోగి రమేష్ మీడియా ముఖ్యంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.

పేర్ని నాని ఎమోషన్ కు అర్థం ఉందా
మాజీమంత్రి పేర్ని నాని ( perni Nani ) అయితే మరోరకంగా ఎమోషన్ అవుతున్నారు. రేషన్ బియ్యం కేసులో తన భార్యను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సీఐ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజే తాను చచ్చిపోయినంత పని అయిందని చెబుతున్నారు. నిజమే పేర్ని నాని బాధలో అర్థం ఉంది. కానీ అంతకుమించి అన్నట్టు ఉండేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత పగ, ప్రతీకార రాజకీయాలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై వ్యక్తిగత విమర్శలు కొనసాగేవి. అలా చేయడంలో తన పాత్ర కూడా ఉందన్న విషయం పేర్ని నాని తెలుసుకోవాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తననే ప్రయోగించిందన్న విషయాన్ని గుర్తించాలి. చివరకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడేలా వ్యవహరించింది ఎవరో గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ చేయించుకున్న అచ్చెనాయుడును వందలాది కిలోమీటర్లు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన విషయాన్ని సైతం గుర్తు చేసుకోవాలి పేర్ని నాని. కేసు విచారణకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తేనే పేర్ని నాని బాధపడితే.. అమరావతికి మద్దతుగా మాట్లాడిన 7 పదుల వయసులో ఉన్న వృద్ధురాలిపై కేసు పెట్టడాన్ని ఏమనాలి?

నాడే గౌరవంగా నడుచుకుని ఉంటే
వైసీపీ నేతలకు ఇప్పుడు కుటుంబాలు గుర్తుకొస్తున్నాయి. తమ కుటుంబ గౌరవాలు గుర్తుకొస్తున్నాయి. తమ ఇంట్లో మహిళలకు అవమానం జరుగుతుండడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. మహిళలను అవమానించడం, ఇబ్బందులు పెట్టడం ముమ్మాటికీ నేరమే. కానీ ఇదే జోగి రమేష్ తన భార్య చంద్రబాబు సతీమణి విషయంలో బాధపడితే.. నాడే ప్రకటించి ఉంటే బాగుండేది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న సన్నాసి అంటూ పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని వ్యక్తిగత కామెంట్లు చేయక ఉంటే.. ఆయన తన భార్య విషయంలో పడుతున్న బాధకు ఒక అర్థం ఉండేది. కానీ అవేవీ గుర్తుచేసుకోకుండా.. తన కుటుంబానికి, తన భార్య గౌరవానికి భంగం కలిగిందని చెప్పి చచ్చిపోయినంత పని జరిగిందని చెప్పడం మాత్రం ముమ్మాటికీ సహేతుకం కాదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.