ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు రైతులను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా అడపాదడపా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతుల కుటుంబాల్లో విషాదం నింపింది.
ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరిలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేసే క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. వర్షం నుంచి రక్షణ కోసం పొలంలోనే ఉన్న కర్రలతో ఏర్పాటు చేసిన గుడిసెలోకి అందరు వెళ్లారు. అదే సమయంలో గుడిసెపై పిడుగు పడింది. ఈ ఘటనలో పెందూర్ మాదర్రావు(45), సంజన(22), మంగం భీంబాయి (40), సిడాం రాంబాయి (45) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 10 మందిని తొలుత ఝురి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఆ తరువాత రిమ్స్ ఆసుపత్రికి తరిలించారు.
జిల్లాలోని బేల మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుపాట్లకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. సాంగిడిలో పొలం పనులు చేస్తున్న నందిని (30), సోన్కాస్‌లో పత్తి విత్తనాలు వేస్తున్న సునీత(35)పై పిడుగు పడడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం నేల తల్లికి నమస్కరించి పొలం పనులకు వెళ్లినవాళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఉట్నూర్ మండలం కుమ్మరితాండలో వ్యవసాయ పనులు చేస్తున్న ముగ్గురు రైతులు రహదారిపై వెళ్తున్న దాదాపు 15 మంది బాటసారులు.. వర్షం రావడంతో పొలంలోని పశువుల పాకలోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపడటంతోనే కుమ్మరితాండలోని ఒకే కుటుంబానికి చెందిన రైతులు బోకన్ ధన్‌రాజ్ (27), నిర్మల (36), టోకన్ కృష్ణబాయి (30)లకు గాయాలయ్యాయి. తాంసీ మండలం బండలానాగాపూర్లోని రామాలయంపై పిడుగు పడటంతో పైనున్న ఆలయం గోపురం స్వల్పంగా ధ్వంసమైంది.