గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దిలీప్‌ దోషి (77) సోమవారం లండన్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో ఆయనకు తొలిసారి భారత్‌ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది.


1979-1983 మధ్య కాలంలో 33 టెస్టులు ఆడి 114 వికెట్లు పడగొట్టిన దిలీప్‌ దోషి…15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు.

1981లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్‌ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సుదీర్ఘ కాలం ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌, నాటింగ్‌హామ్‌షైర్‌ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత లండన్‌లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు.

కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత్‌ జట్టులో బిషన్‌సింగ్‌ బేడి హవా నడుస్తుండటంతో దిలీప్‌కు ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. ‘స్పిన్‌ పంచ్‌’ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్‌ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.

కాగా ఆయన కుమారుడు నయన్ జోషీ సైతం సర్రే, సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దోషీ మృతికి సంతాపంగా లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు ఆటలో భారత్‌-ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బ్లాక్‌ బ్యాండ్స్‌ భుజానికి కట్టుకుని బరిలోకి దిగనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.