ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచినట్లు ప్రకటించింది. మే 1వ తేదీ(ఇవాళ్టి) నుంచే ఈ రేట్లు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. అయితే.
పెంచిన ధరల్ని కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు మాత్రమే వర్తింప జేసింది. అయితే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా రూ.993కి పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలను మాత్రం కేంద్రం పెంచలేదు. ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. ఇది 33 కోట్ల మంది వినియోగదారులకు ఊరట ఇచ్చే విషయమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటోంది. పెరిగిన రేటుతో.. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 3,071, హైదరాబాద్‌లో రూ.3,069కి చేరింది.
పశ్చిమాసియా యుద్ధం..చమురు సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లు దొరక్క వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రేట్ల పెంపు ఉండదంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలు ముగిశాక రేట్లు పెరగవచ్చనే ఊహాగానాలు తెర మీదకు రాగా.. కేంద్రం వాటిని ఖండించింది కూడా. కానీ, ఇప్పుడు భారీగా కమర్షియల్ బండ రేటు పెంచేసింది.
భారం సామాన్యులపైనా?
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్లాక్‌లో కూడా సిలిండర్లు దొరక్క మొదట్లో హాస్టల్స్, హోటల్స నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంటకాలు చేయడం.. ఫీజులను పెంచడం లాంటివి చేశారు. మెనూ నుంచి కొన్ని వంటకాలను కత్తిరించారు. కంపెనీలు కొన్ని క్యాంటీనులు మూసేయగా.. మరికొన్ని ఆఫీసులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచించాయి.
ఒకానొక టైంలో ప్రధాన నగరాల్లో హోటళ్లను సైతం మూసేయించిన సంగతి తెలిసిందే. అటుపై ఆ సంక్షోభం కొనసాగడంతో టీ, టిఫిన్ల రేట్లనూ విపరీతంగా పెంచేశారు. ఈ తరుణంలో ఇప్పుడు పెరిగిన ధరల భారం పరోక్షంగా సామాన్యుల పైనా పడే అవకాశమూ లేకపోలేదు.
19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు మార్చి నుండి మూడుసార్లు పెరిగాయి.
- 1 మార్చి: రూ28–రూ31 పెరుగుదల.
- 7 మార్చి: రూ114.5 పెరుగుదల.
- ఏప్రిల్‌లో: రూ196–రూ218 పెరుగుదల.
- మే 1 నాటికి.. రూ.993కి చేరింది.
ఆర్థిక ప్రభావం
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో సిలిండర్‌పై రూ.380 నష్టాన్ని భరిస్తున్నాయట. మే చివరి నాటికి మొత్తం నష్టం రూ.40,484 కోట్లకు చేరే అవకాశం ఉందని చెబుతున్నాయి.
నేటి నుంచే న్యూరూల్స్..
వంటగ్యాస్ వినియోగదారులకు అలర్ట్. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇంధన సంక్షోభం నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేంద్రం చెబుతోంది. అవి..
ద్వంద్వ కనెక్షన్లపై నిషేధం!, అంటే.. ఎల్పీజీ, పీఎన్జీ (Piped Natural Gas) రెండింటినీ కలిగి ఉన్న గృహాలు ఇకపై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేదంటే ఎల్పీజీకి సంబంధించి కొత్త కనెక్షన్ పొందలేవు. అలాగే.. రెండింటిలో ఏదో ఒకటే కలిగి ఉండాలి. ఈ నిబంధనను చాలా రోజుల కిందే ప్రకటించడంతో చాలామంది ఏదో ఒక కనెక్షన్‌ను వదిలేసుకున్నారు. ఇప్పటివరకు 43,000 మంది వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్‌ను వదిలేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అలాగే నగరాలు, పట్టణాల్లో రెండోసారి గ్యాస్ బుకింగ్ గ్యాప్‌ను 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వరకు పెంచారు. ఇక సిలిండర్ డెలివరీ ఓటీపీ తప్పనిసరి అని తెలిసిందే. అలాగే వినియోగదారులు కూడా కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి.









