బలూచ్ నేతలు పాకిస్తాన్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర దేశంగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని, ఐక్యరాజ్యసమితిని కోరుతున్నారు. అలాగే, న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పా టు చేయాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్‌లో విస్తీర్ణపరంగా అతి పెద్ద ప్రావిన్స్ బలూ చిస్తాన్. దీనిని ప్రత్యేక దేశంగా గుర్తించా లని ఈ మేరకు బలూచిస్తాన్ నాయకుడు ‘మీర్ యార్’ బలూచ్ ఎక్స్‌లో పలు పోస్టు లు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటును తన పోస్టులో ప్రకటించారు.
తమను ఒక దేశంగా గుర్తించి కరెన్సీ, సపరేట్ పాస్‌పోర్ట్ జారీ, ప్రాథమిక అవసరాలకు నిధులను సమకూర్చాలని ఐక్యరాజ్యసమితిని వారు అభ్యర్థించారు. అలాగే తమను, పాకిస్తానీలను ఒకటిగా చూడవద్దని భారతీయ మీడియాను వారు కోరారు.
భౌగోళిక నేపథ్యం
బలూచిస్తాన్ దక్షిణ ఆసియాలో చారిత్రకంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన భూభాగం. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం, ఆ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైనా, రాజకీయ శక్తిలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. ఈ ప్రాంత చరిత్రను, సామాజిక-ఆర్థిక పరిస్థితిని, భౌగోళిక విశిష్టతను, ప్రస్తుత ఉద్యమాల రాజకీయ పటాలను విశ్లేషించకపోతే ఈ ప్రాంత సమస్యలకు ముడిపడిన అసలైన సమస్యలు తెలిసే అవకాశం లేదు. బలూచిస్తాన్ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో సుమారు 44 శాతం ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల సరిహద్దులకు ఆనుకొని ఉండటంతో, ఇది భౌగోళిక రాజకీయాల పరంగా చాలా కీలకమైన ప్రాంతం. గ్వాదర్ పోర్ట్ వంటి ప్రాజెక్టులను చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్నా, దాని వల్ల ఈ ప్రాంత ప్రజలకు అసలు ప్రయోజనం కలగడం లేదు.
సామాజిక, ఆర్థిక పరిస్థితి
బలూచిస్తాన్‌లో జనాభా తక్కువే అయినా, సహజ వనరులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్, ఖనిజాలు విస్తృతంగా ఉన్నాయి. అయినా ఈ వనరులపై స్థానికులకు ఎలాంటి హక్కులూ లేవు. పాకిస్తాన్ పాలనలో ఈ ప్రాంత వనరులను అన్య ప్రాంతాలకు తరలిస్తున్నా, బలూచ్ ప్రజలకు మాత్రం విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి మౌలిక అవసరాలు తీరడం లేదు. ఇది విపరీతమైన అసమానతలకు దారి తీసింది. పేదరికం, నిరుద్యోగం, అక్రమ అరెస్టులు, గోప్యతా సమస్యలు, నిర్బంధాలు సామాన్య జీవితాన్ని భయంతో నింపుతున్నాయి. 1947లో భారత ఉపఖండ విభజన అనంతరం పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్‌ను తనలో కలిపేసుకుంది. అప్పటి నుంచే పాకిస్తాన్‌పై స్థానికుల వ్యతిరేకత మొదలైంది. 1948, 1958, 1962, 1973, 2004 సంవత్సరాలలో ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగాయి.. అక్కడి ప్రజలు తమ ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలతో నిలకడగా కొనసాగి ఇప్పుడు తమది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. దీనిని ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు గుర్తించాల్సి ఉంటుంది.
సాంస్కృతిక నేపథ్యం
బలూచీ భాష, కళలు, నృత్యాలు, జీవన విధానం ప్రత్యేకమైనవే. కానీ పాకిస్తాన్ ఈ సాంస్కృతిక విశిష్టతలను గుర్తించని విధంగా జాతీయత పేరుతో బలవంతపు ఉర్దూ ఆధిపత్యాన్ని వారిపై మోపుతున్నారు. ఇది బలూచ్ సమాజాన్ని మరింత బహిష్కృతంగా మార్చింది. విద్యలో బలూచీ భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాక, వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో వికృ తంగా చూపించటం వల్ల సాంస్కృతిక అపకీర్తి ఏర్పడింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితి
ఇటీవల కాలంలో బలూచ్ రాజకీయ కార్యకర్తలు, మేధావులు, విద్యార్థులు భౌతికంగా కనిపించకుండా పోవడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. ఆకస్మికంగా జరుగుతున్న ‘బలవంతపు అదృశ్యాలు’ బలూచిస్తాన్‌ను భయాందోళన ప్రాంతంగా మార్చాయి. స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పోరాటం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదం పేరుతో వాటిని తీవ్రంగా అణిచివేస్తోంది.
బలూచ్ ప్రాంతీయ సమస్య కాదు..
బలూచిస్తాన్ సమస్య ఒక ప్రాంతీయ సమస్య మాత్రమే కాదు. అది మానవ హక్కులకు సంబంధించినది. ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువల సమస్యగా ఉంది. ఆర్థిక వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత, రాజకీయ నిరంకుశతలపై ప్రపంచం స్పందించాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు. బెలూచ్ ప్రజలకు తమ భవితవ్యాన్ని నిర్ణయించుకునే హక్కు, జీవించడానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిదీ కూడా.