కొత్త చట్టం.. 9 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి!?

తొమ్మిదేళ్ల వయసులో బాలికలకు వివాహం చేయడం అనేది అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. 9 ఏళ్ల వయసులో బాలికలను పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించే విధంగా ఇరాక్ వివాహ చట్టానికి చట్టపరమైన సవరణలను ఆమోదించనున్నట్లు తెలుస్తుంది.


దీనిని 188 చట్టం అని కూడా పిలుస్తారు. ఇది 1959లో ప్రవేశపెట్టారు. అయితే ఇరాక్‌లో దాదాపు 28% అమ్మాయిలు 18 సంవత్సరాల వయస్సు లోపు వివాహం చేసుకున్న వారే ఉండటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. ఆచారాలకు ప్రాధాన్యత అంటూ కొత్త చట్టాలతో విమర్శల పాలవుతున్న ఇరాక్ పాలకులు మరో వివాదాస్పద బిల్ పాస్ చేశారు. దీంతో గతంలో 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల కనీస వివాహ వయస్సు నిబంధన మారనుంది. మతంలోని ఒక తెగ/ వర్గం నిబంధనల ప్రకారం పెళ్లి చేయొచ్చు. అక్కడ షియత్‌లు ఎక్కువగా అనుసరించే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్ల బాలికకూ పెళ్లి చేయొచ్చు. దీంతో మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో ఈ అంశం పై మహిళలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.