పసిడి ధరలు 2025కి కొన్ని వారాల ముందు నుంచి విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా గోల్డ్ వినియోగిస్తున్న వారిలో ఇండియా చైనాను కూడా ప్రస్తుతం దాటేసింది. దేశీయంగా బంగారం వినియోగానికి తగినట్లుగా ఉత్పత్తి లేనప్పటికీ ఇండియా దిగుమతులపై ఎక్కువ ఆధారపడుతోంది. పైగా నిర్మలా సీతారామన్ సుంకం తగ్గింపులతో పసిడి స్మగ్లింగ్ కూడా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సేఫ్ హెవెన్ గోల్డ్ ధరలకు ట్రంప్ నిర్ణయాలు రెక్కలు ఇస్తున్నాయి. స్పాట్ మార్కెట్లో కొత్త ఏడాది ఇప్పటి వరకు 9 శాతం పెరగటం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి అనుగుణంగానే రిటైల్ మార్కెట్లో కూడా ప్రతిరోజూ గోల్డ్ రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా రూ.90,000 మార్కును తాకే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
సాఘారణంగా విపత్తులు, ఆర్థిక సవాళ్లు, మాంద్యం, విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమయాల్లో పసిడి డిమాండ్ పెరుగుతుంటుంది. ప్రజలు తమ సంపద విలువను తగ్గకుండా చూసేందుకు పసిడిలో పెట్టుబడి పెడుతుంటారు. కానీ ట్రంప్ రాకతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే చైనాపై 10 శాతం సుంకం విధించిన ట్రంప్.. కెనడా, మెక్సికోలకు 25 శాతం పన్ను విధించి వెనక్కి తీసుకున్నారు. త్వరలోనే అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై నిర్మొహమాటంగా టారిఫ్స్ ఉంటాయని చెప్పారు.
ఇది ప్రపంచ వృద్ధిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ గెలిచిన నాటి నుంచి అమెరికన్ డాలర్ తన బలాన్ని రోజురోజుకూ పుంజుకుంటూ పోతోంది. దీంతో రూపాయి విలువ కొత్త కనిష్ఠాలకు దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీల పరిస్థితి కూడా ప్రస్తుతం ఇదే విధంగా కొనసాగుతోంది. ఈక్విటీ మార్కెట్లు కూడా ఎన్నడూ చూడని స్థాయిలో ఓలటాలిటీకి లోనవుతున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇప్పటికే లక్ష మార్కును దాటేసి సామాన్యులకు దూరమైపోయింది.
ఈనెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో కొన్ని పన్నులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ తో మోదీకి మంచి రిలేషన్ షిప్ ఉండటంతో భారత్ ట్రంప్ టారిఫ్స్ వార్ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోందనే వాదన సైతం నిపుణుల నుంచి వినిపిస్తోంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7980గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8706 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.