Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌.. లక్ష మందికి ప్రయోజనం.. కోడ్ ముగిసిన తరువాత జీవో జారీ..

Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌.. లక్ష మందికి ప్రయోజనం.. కోడ్ ముగిసిన తరువాత జీవో జారీ..


నెల రోజులుగా కసరత్తు చేస్తూ ఇటీవలే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే.. సొంతంగా అమలుకు కూటమి ప్రభుత్వం మొగ్గుచూపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వనుంది.
అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతీయేటా అదనంగా రూ.10కోట్లు భారం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తరువాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్రంలోని లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం కలగనుంది.
గ్రాట్యూటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే సంవత్సరానికి 15రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద ఇస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500 వేతనం ఉంది. ఇందులో 15రోజుల వేతనం అంటే రూ.5,750 వస్తుంది. వారిని విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు, 62ఏళ్లు వచ్చే వరకు విధుల్లో ఉండి పదవీవిరమణ చేస్తే 27ఏళ్లు సర్వీసులో ఉన్నట్లు లెక్క. ఆ ప్రకారం.. ఆమెకు రూ.1.55 లక్షలు గ్రాట్యుటీగా వస్తుంది. అయితే, 25ఏళ్లు, 30ఏళ్లకే అంగన్ వాడీ కార్యకర్తగా చేరిన వారికి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ కింద మరింత ఎక్కువ అందుతుంది. ఆయాలకు నెలకు రూ.7వేలు కాగా.. వారికి సర్వీసుకు అనుగుణంగా గ్రాట్యుటీ అందనుంది.

దేశంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీల గ్రాట్యుటీ అమలవుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు అంగన్వాడీల పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచారు. దీంతో 2026 జనవరి వరకు పదవీ విరమణలు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత జరిగే పదవీ విరమణలకు గ్రాట్యుటీ అమల్లోకి వస్తుంది. ప్రతీయేటా జరిగే పదవీవిరమణలకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపులకు రూ.20కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.