తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్.
అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రవేశ పెట్టింది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కొత్తగా మరికొంత మంది పెరిగారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కిడ్నీ రోగులు నిత్యం ఆస్పత్రులకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. వారం వారం ఆస్పత్రికి వెళ్లాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులకు పెన్షన్ మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం గా చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో కిడ్నీ రోగులు ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుంది.
మరోవైపు రాష్ట్రంలోని హెచ్ఐవీ రోగులకు కూడా పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే 13వేల మందికి పైగా హెచ్ఐవీ రోగులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలో అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతులు సైతం కోరింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.993 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా చేయూత పథకం కింద ప్రతి నెలా రూ. 4వేలు పెన్షన్ అందించనున్నట్లు పేర్కొంది.