తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2025 సందర్భంగా జూన్ 2వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు ఎప్పుడో నుంచో ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తోంది.
ఇటీవల ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) 57 పెండింగ్ సమస్యలపై సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి మంగళవారం ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రభుత్వం పరిశీలనలో ఉంది, మరియు ఉద్యోగులకు ఏమి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల విడుదల, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, డీఏల ప్రకటన.. ఈ అంశాలు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించేలా రూపొందించబడ్డాయి, మరియు జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ‘కానుకల వర్షం’ను ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
































