ఏపీలో గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల రేషనలైజెషన్ తర్వాత ప్రభుత్వం బదిలీలు చేస్తోంది. ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేస్తే.. బదిలీ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాలు కాలం పూర్తికాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా పేర్కొంది. ఉద్యోగికి తన సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, భార్యా భర్తలు ఒకే చోట పోస్టింగ్‌లకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వనుంది.
ఖాళీల వివరాలు హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారని పేర్కొంది. బదిలీ యూనిట్ పాత జిల్లాల ఆధారంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. 5 సంవత్సరాలు పూర్తికాని ఉద్యోగులకై ఆన్‌లైన్ ద్వారా బదిలీ అభ్యర్థన ఇచ్చే సదుపాయంను కల్పించింది. దృష్టిహీనులైన వారు స్వచ్చందంగా కోరితే మాత్రమే బదిలీ ఉంటుంది. మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో రెండు ఏళ్లకు పైగా పనిచేసిన వారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యంతో ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య కారణాలతో బదిలీ కోరినవారు, కంటుబడిన ఉద్యోగినులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. ఐటీడీఏ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో ముందుగా ఖాళీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ అయిన వారిని ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ చేసిన తరువాతే రిలీవ్ చేయాలన్న నిబంధన పెట్టింది. బదిలీ అయిన వారు సూచించిన స్థలానికి చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. బకాయి చెల్లింపులు చెల్లించకుండా ఏ ఉద్యోగినీ ఉద్యోగినీ రిలీవ్ చేయకూడదు. హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో అన్ని ఉద్యోగుల వివరాలను జులై 10లోపు అప్‌డేట్ చేయాలని పేర్కొంది.