యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏపీ సర్కార్ తీసుకుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా, విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను స్వయంగా సీఎం పరిశీలించారు. యోగా డే కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు.
అయితే, బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబుకి విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వివరించారు. 607 సచివాలయాల సిబ్బంది ఈ యోగాడేకు హాజరవుతున్నారు.. వారే సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు సీఎం.. ఇక, యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని సూచనలు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రధాని మోడీ సహా ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాను కట్టుదిట్టం చేయాలని అధికారులకు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లను ఏ విధంగా చేశారని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.