దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం. అలానే సంపాదన మెరుగ్గా ఉన్నప్పుడే పదవీ విరమణ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్) ద్వారా పదవీ విరమణ జీవితానికి భరోసా ఇస్తుంది. ఈ నేపథ్యంలోఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్) అనేది దేశంలో ప్రభుత్వ మద్దతుతో కూడిన పదవీ విరమణ పొదుపు పథకం. ఇది ప్రజలు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. జీతం పొందే ఉద్యోగులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం రూపొందించిన ఎన్‌పీఎస్ మార్కెట్-లింక్డ్ రాబడి, పన్ను ప్రయోజనాలను అందించడం ద్వారా క్రమశిక్షణ కలిగిన, దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. ఈ స్కీమ్‌లో పాక్షిక ఉపసంహరణలను అనుమతి ఉంటుంది. అలాగే పదవీ విరమణ తర్వాత యాన్యుటీని అందిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు తగినంత సామాజిక భద్రత లేకపోవడంతో నిర్మాణాత్మక పెన్షన్ పథకం కలిగి ఉండటం గతంలో కంటే చాలా కీలకంగా మారింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లాంచ్ చేసింది.
ఎన్‌పీఎస్ అనేది నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన పదవీ విరమణ ఎంపికగా నిలుస్తుంది. అదే సమయంలో సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బి) కింద పన్ను విధించదగిన ఆదాయాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్‌పీఎస్ రెండు ప్రధాన రకాల ఖాతాలను అందిస్తుంది: టైర్-I ఖాతా అంటే ఉపసంహరణలపై పరిమితులతో కూడిన ప్రాథమిక పదవీ విరమణ ఖాతా. ఇక్కడ చేసిన విరాళాలు సెక్షన్ 80సీ (రూ. 1.5 లక్షల వరకు), 80సీసీడీ (1బి) (అదనపు ₹50,000) కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళిక కోసం ఉద్దేశించి రూపొందించారు. టైర్-II ఖాతా అనేది ఐచ్ఛికం. ఇది ఉపసంహరణ పరిమితులు లేని స్వచ్ఛంద పొదుపు ఖాతా. అయితే చందాదారుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే తప్ప ఇది పన్ను ప్రయోజనాలను అందించదు.
అర్హతలు ఇవే
- ఎన్‌పీఎస్ 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అన్ని భారతీయ పౌరులు వర్తిస్తుంది. యువతతో పాటు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న వారికి కూడా పెట్టుబడికి అనుమతి ఇస్తుంది.
- మీరు జీతం పొందే ఉద్యోగి అయినా, స్వయం ఉపాధి పొందుతున్న వారైనా, లేదా ఫ్రీలాన్సర్ అయినా మీరు ఎన్‌పీ ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.
- జీవితంలో తరువాతి దశలో పదవీ విరమణ కోసం ప్రణాళికలు ప్రారంభించే వారికి కూడా, నిర్మాణాత్మక పెన్షన్ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఈ పథకం మెరుగ్గా ఉంటుది.
దరఖాస్తు ఇలా
- ఎన్‌పీఎస్ ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవడం చాలా సులభం. ఈ-ఎన్‌పీఎస్ పోర్టల్ లేదా పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీఎస్) అని పిలిచే బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్ల్స్ ద్వారా చేయవచ్చు.
- https://enps.nsdl.com ని సందర్శించాలి.
- “నేషనల్ పెన్షన్ సిస్టమ్”ను “రిజిస్ట్రేషన్” పై క్లిక్ చేయాలి.
- “వ్యక్తిగత సబ్‌స్క్రైబర్” ఎంచుకోవాలి.
- మీ ఆధార్ లేదా పాన్ వివరాలను నమోదు చేయాలి.
- మీ వ్యక్తిగత, బ్యాంక్, నామినీ వివరాలను అందించాలి.
- కేవైసీ పత్రాల స్కాన్ చేసిన కాపీలు, ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయండి.
- ప్రారంభ విరాళం ఇవ్వాలి (టైర్-I కోసం కనీసం రూ. 500).
- పాస్‌వర్డ్‌ను సెటప్ చేసి మీ ప్రాన్ (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య) పొందాలి.