ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడికి నాడే బీజం పడిందా?

మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడికి మూలం పడిందని, ఆ రిజల్టే జూన్‌ 4న వెలువడిన ఫలితాల్లో వెల్లడైందనే చర్చ తాజాగా అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు అధికారుల వర్గాల్లోను జరుగుతోంది.


ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపిక నుంచి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి బలాబలాలు, బలహీనతలు ఏమిటి వంటి అనేక అంశాలపై ఎలాంటి చర్చ సాగిందో.. ఫలితాలు వెలువడిన నెల రోజులు కావస్తున్నా నేటికీ అదే చర్చల వాతావరణం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తీరు వంటి అనేక అంశాలపైన సర్వత్రా చర్చోప చర్చలు సాగుతున్నాయి. ఊహించని రీతిలో ఫలితాలు వెలువడంతో వీటిపైన ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఎవరి లాజిక్‌లు వారు చెబుతూ చర్చలు సాగిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, భారీగా పెరిగిన ఓటింగ్‌ సరళి, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగ ప్రజలిచ్చిన తీర్పు వంటి పలు అంశాలపై రాజకీయ వర్గాల్లోనే కాదు అధికార వర్గాల్లో కూడా విస్తృత స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ఇంకా ఎలక్షన్‌ వాతారణం నుంచి బయట పడలేక పోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి అనేది సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే ముందుగానే ఫిక్స్‌ అయిపోయిందనే వాదన అధికంగా వినిపిస్తోంది. 2023 మేలో జరిగిన పట్టభద్రుల ఎన్నిలక ఫలితాలే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ప్రతి రూపమనే టాక్‌ ఎక్కువుగా సాగుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2023లో మూడు పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలను నాడు అధికార పక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో పావులు కదిపారు. టీడీపీ అభ్యర్థులను ఓడించి మండలిలో తన పట్టును నిలుపుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ భావించగా, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఓడించి అటు మండలిలోను, ఇటు ప్రజలు, తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, ప్రభుత్వం తాలూకు వ్యతిరేకతను చాటి చెప్పాలని టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగారు. నువ్వా.. నేనా అన్నట్లు హోరా హోరీగా సాగిన ఈ మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లా పట్ట భద్రుల ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లా పట్ట భద్రుల ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు.ఎన్నికలు జరిగింది మూడు స్థానాలకే అయినా వాటి పరిధిలో ఇంచు మించు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలుస్తుండటంతో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మినీ సార్వత్రిక ఎన్నికలుగా అప్పట్లో వీటిని అభివర్ణించారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల నుంచి చదువుకున్న వారు ఓటర్లుగా ఉండటంతో వారి తీర్పును రాష్ట్ర మొత్తం తీర్పుగా పరిగణలోకి తీసుకోవచ్చనే టాక్‌ కూడా అప్పట్లో సాగింది. నవరత్నాల పథకాల అమలుతో పాటు వలంటీర్లను ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాం, గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పడం, తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామనే ఆలోచనల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. దీంతో సులువుగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కానీ ఓటర్ల నాడిని పసి గట్టలేక పోయారు. వారి మనసుల్లో తనపైన, తన పాలనపైన ఎలాంటి అభిప్రాయం ఉందో అనే విషయాన్ని అంచనా వేయలేక పోయారు. దీంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన పాలనకు వ్యతిరేకంగా ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని ఓటర్లు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకే పట్టం గట్టారు.నాటి పట్ట భద్రుల ఎన్నికలు, వాటి ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఒక ఇండికేషన్‌ లాంటింది. ఒక పార్టీకి అధినేతగాను, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేతగా జగన్‌మోహన్‌రెడ్డి దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. ఎక్కడ డ్యామేజీ జరిగింది, దానిని ఎలా పూడ్చుకోవాలనే అంశాలపై పునరాలోచనలు చేయాలి. కానీ అలాంటి ఆలోచనలు కానీ, కార్యక్రమాలు కానీ చేపట్ట లేదు. అప్పటికే జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగి పోయింది. దానిని సరిదిద్దుకుని ప్రజల్లోకి వెళ్లుంటే మరీ ఇంత దారుణంగా జగన్‌ పార్టీ ఓటమి పాలయ్యేది కాదనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.