సెలవులు అంటే ఉద్యోగులకే కాదు, విద్యార్థులకు కూడా ఎంతో ఇష్టం! కానీ ఏటా లిమిటెడ్‌గా వచ్చే సెలవులే వీకెండ్‌లకు పడితే మాత్రం అసలు అసంతృప్తి తథ్యం.
ఇప్పుడు అదే పరిస్థితి రిపబ్లిక్ డే (జనవరి 26) విషయంలో ఎదురైంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే ఆదివారం రోజుకు వచ్చింది. సాధారణంగా ఇది నేషనల్ హాలీడే అయినప్పటికీ, వీకెండ్‌కి పడిపోయిన కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యేక సెలవును ఆస్వాదించలేకపోతున్నారు. “సంక్రాంతి తర్వాత వచ్చే ఈ బ్రేక్ చాలా అవసరమైంది.. కానీ వారం చివరికి వచ్చేయడంతో, సెలవు అని అసలు ఫీలింగే లేదు!” అని ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్
ఐటీ రంగంలో పని చేసే వారు వీకెండ్ హాలీడేస్‌ను స్మార్ట్‌గా ప్లాన్ చేసుకుని చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం సాధారణం. అయితే, జనవరి 26 ఆదివారం రావడం వల్ల ఈసారి అదీ అసాధ్యమైంది.
“ఒకరోజు ముందు లేదా తరువాత వచ్చుంటే నాలుగో శనివారం + ఆదివారం + రిపబ్లిక్ డే కలిపి లాంగ్ వీకెండ్ వచ్చేది” అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మార్చిలో ఉగాది కూడా ఆదివారమే!
ఈ ఏడాది ఇదే సమస్య మార్చిలో కూడా ఎదురుకానుంది. ఉగాది (తెలుగు నూతన సంవత్సర దినోత్సవం) కూడా మార్చి 31, ఆదివారానికి వస్తోంది. అంటే ఉద్యోగులకు మరో సెలవు వృధా అయ్యిందన్న మాట. “ఏంటి బాబోయ్, ఏదైనా పెద్ద సెలవు వస్తుందనుకుంటే అది వీకెండ్‌కి పడుతుందే!” అని కొందరు మిమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
సెలవుల ఖాతాలో తగ్గుదల..
జనవరి 26, మార్చి 31 రెండూ వీకెండ్‌లకు వచ్చేయడంతో ఉద్యోగుల సెలవుల లెక్క తగ్గిపోతోంది. ఇకపై వచ్చే సెలవులైనా వర్కింగ్ డేస్‌లో వస్తాయా? లేకపోతే ఇవి కూడా ఇలాగే మిస్ అవుతాయా? అని ఉద్యోగులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికైతే 2025 కొత్త సంవత్సరంలో జనవరిలోనే పాఠశాలలు, కళాశాలలకు చాలా సెలవులు వచ్చాయి. జనవరి నెలలో నూతన సంవత్సరం, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి అనేక సెలవులు ఉంటాయి. 2025 జనవరి నెలలో మొత్తం 31 రోజులు ఉంటే, 8 రోజులు సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించింది. కాబట్టి, విద్యార్థులు, ఉద్యోగులు ఆ రోజు పాఠశాలలు ,కార్యాలయాలకు వెళ్లకుండా ఎంజాయ్ చేశారు. జనవరి 13 సోమవారం భోగి పండుగ , జనవరి 14 మంగళవారం సంక్రాంతి సెలవు పండుగ ..మరుసటి రోజు, జనవరి 15న, కనుమ పండుగకు ఐచ్ఛిక సెలవు ప్రకటించారు. మునుపటి రోజు ఆదివారం.. కాబట్టి జనవరి 12 నుండి 15 వరకు వరుసగా నాలుగు రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు ప్రభుత్వ సెలవు దినం అవుతుంది.
ఆ రోజు ఆదివారం కాబట్టి దానిని సాధారణ సెలవు దినంతో కలిపి ఉంచుతారు. జనవరిలో, 5, 12, 19, 26 తేదీలు ఆదివారాలు కాబట్టి, సాధారణ సెలవు దినం ఉంటుంది. ఈ నాలుగు రోజుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మనం ఈ విధంగా చూస్తే, జనవరిలో సెలవులు విద్యార్థులకు, ఉద్యోగులకు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు.