అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వరుస షాకులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇవాళ ఓ శుభవార్త అందింది.
ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులతో అమెరికాలో ఉంటామో, వెళ్లిపోతామో తెలియక అల్లాడుతున్న వారికి ట్రంప్ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా భారతీయులకు ఇది వర్తించబోతోంది. భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ఈ నిర్ణయం ఊరటనివ్వబోతోంది.
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కావడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు కోవిడ్ 19 టీకా తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనను రద్దు చేసింది. దీన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ఇకపై ఫారమ్ I-693, ఇమ్మిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ రికార్డ్‌లో కోవిడ్ 19 టీకా రుజువు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది.
యూఎస్ సీఐఎస్ ఇకపై కోవిడ్ 19 టీకా పత్రం ఆధారంగా గ్రీన్ కార్డు దారులకు వాటి దరఖాస్తులు తిరస్కరించడానికి లేదా ఆధారాలు కోరడానికి నోటీసులు జారీ చేయరాదని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన రుజువు లేదనే కారణంగా మాత్రమే గ్రీన్ కార్డు దరఖాస్తులు తిరస్కరించకూడదని నిర్ణయం తీసుకుంది. గతంలో 2021లో కరోనా సమయంలో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఇలా గ్రీన్ కార్డ్ దరఖాస్తులకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బైడెన్ నిర్ణయాలన్నీ మార్చేస్తున్న కొత్త అధ్యక్షుడు ట్రంప్ దీన్ని కూడా రద్దు చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగానే గతంలో బైడెన్ సర్కార్ ఇచ్చిన వ్యాక్సిన్ ఆదేశాలపై తన వ్యతిరేకతను గుర్తుచేశారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించినందుకు సర్వీస్ నుంచి తొలగించిన సైనికులను తిరిగి నియమిస్తానని కూడా ప్రకటించారు. అలాగే వారికి పూర్తి బకాయిలు తిరిగి చెల్లిస్తామన్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపైనా కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం లేకుండా చేశారు.