ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున మంజూరుకు ప్రతిపాదనలు తయారు అవుతున్నాయి. పంపిణీకి ముహూర్తం సైతం ఖరారు చేసారు. గ్రామ..పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా అమలు చేస్తుండటంతో అధికారులు తుది మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.
ఉగాదికి ముహూర్తం
కూటమి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి సిద్దమవుతోంది. వచ్చే ఉగాది నుంచి పట్టాలు లబ్దిదారులకు ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఎక్కడైనా భూమి లభ్యత లేని పట్టణ ప్రాంతాల్లో జీ+3 విధానంలో టిడ్కో గృహాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రస్తుతం 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా దాన్ని 150 గజాలకు పెంచాలని తాజాగా నిర్ణయించారు.
అధికారుల కసరత్తు
ఈ నిర్ణయం మేరకు ఇంటి స్థలాల పంపిణీ మార్గదర్శకాల రూప కల్పన కోసం అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. స్థలాల కేటాయింపులో బీపీఎల్ రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత పేదలకు స్థలాలు మంజూరు చేయనున్నారు. ఉగాది నుంచి ఇళ్ల పట్టాల మంజూరు ప్రారంభించి నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. అయితే, లబ్దిదారుల అర్హతల పైన కసరత్తు చేస్తున్నారు. గతంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారిని తిరిగి పరిగణలోకి తీసుకోవద్దని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
మార్గదర్శకాలు
ఇక, లబ్దిదారుడు ఏపీలో ఆధార్ కార్డుతో పాటుగా ఇక్కడే నివాసితుడై ఉండాల్సి ఉంటుంది. అదే సమయంలో గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లే అవుట్లను రద్దు చేసి కొత్తగా లే అవుట్లు ప్రభుత్వం ఖరారు చేయాలని నిర్ణయం తీసుకుంది. పాత లే అవుట్లలో ఇల్లు కట్టుకోని వారి నుంచి స్థలం తీసుకొని తిరిగి వేరే ప్రాంతంలో కేటాయించే అవకాశం పరిశీలనలో ఉంది. ఈ పట్టాలు అందుకున్న వారికి సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ పట్టాల పంపిణీలు.. మార్గ దర్శకాలకు తుది ఆమోదం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.