మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఎంత నూనె వాడాలి? ICMR సిఫార్సులు

ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు వంట నూనె వినియోగం ప్రతి ఇంట్లోనూ ఎక్కువగానే ఉంటోంది. నూనెలో వేయించిన ఆహార పదార్థాలు రుచికరంగా ఉండటంతో చాలామంది ఎంత నూనె వాడాలో, ఒకసారి వాడిన నూనెను మళ్లీ ఉపయోగించవచ్చా అనే సందేహాల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి, నూనె వినియోగంపై నిపుణులు ఐసీఎంఆర్ సూచనలు మీ కోసం.

ప్రస్తుత జీవనశైలిలో ఇంట్లో వంట నూనె వినియోగం గణనీయంగా పెరిగింది. వివిధ అధ్యయనాల ప్రకారం, దేశంలో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 23.5 లీటర్ల వంటనూనెను ఉపయోగిస్తున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సిఫార్సుల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 20 మి.లీ (నాలుగు టేబుల్ స్పూన్లు) కంటే ఎక్కువ నూనె తీసుకోకూడదు. అంటే, నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం నెలకు కనీసం 2.5 లీటర్లు, గరిష్టంగా 4 లీటర్ల కంటే ఎక్కువ నూనె వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువగా ఉంటే ఊబకాయం గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ నూనె వాడటం వల్ల ఆర్థిక భారం పెరగడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టవుతుందని వారు పేర్కొంటున్నారు.


ఒకసారి మరిగించిన నూనెను మళ్లీ వాడొచ్చా?

ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ వాడకూడదని పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీ దేవి సూచిస్తున్నారు. పొంగుతున్న లేదా రంగు మారిన నూనెను అస్సలు ఉపయోగించకూడదు. రోడ్డు పక్కన బళ్లపై హోటళ్లలో వాడిన నూనెను మళ్లీ ఉపయోగించడం వల్ల అది నల్లగా జిగురుగా తయారవుతుంది. ఒకసారి బాగా వేడి చేసిన తర్వాత ఆ నూనెను సాధారణ కూరల్లో ఉపయోగించడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, రెండు లేదా మూడు సార్లు డీప్ ఫ్రై చేసిన నూనె చిక్కగా తయారవుతుంది అది ఎందుకూ పనికిరాదు. ఇలాంటి నూనెను వాడటం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక ప్రభావాలు:

వంట నూనెను ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వేడి చేయాలి. అంతకంటే ఎక్కువసార్లు వేడి చేస్తే అది హానికరమైన సమ్మేళనాలను విడుదల చేస్తుంది. నూనెను పదేపదే మరిగించడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, పదేపదే వేడి చేసే వంట నూనెలు పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి వివిధ రకాల సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి, వీటిలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా గుర్తించబడ్డాయి.

రుచి పోషక విలువలు:

పదేపదే వేడి చేసిన నూనెలో విటమిన్ ఇ, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషక విలువలు నాశనం అవుతాయి. అంతేకాకుండా, నూనె రుచి కూడా మారుతుంది, దీనివల్ల ఆహార పదార్థాల రుచి చేదుగా తయారవుతుంది.

అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు:

ఐసీఎంఆర్ సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ నూనె వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కడుపు ఉబ్బరం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, ఇది ఇన్సులిన్ సమస్యలను పెంచి డయాబెటిస్‌కు దారితీస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా రోజువారీ వంట నూనె తీసుకోవడం అనేది హృదయ సంబంధ వ్యాధులు  మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం కలిగి ఉంటుందని పేర్కొంది.