రైలు ద్వారా బైకును ఎలా పార్శిల్ చేయాలి మరియు దాని ధర ఎంత?

మీరు మీ బైక్‌ను వేరే నగరానికి పంపాలనుకుంటే, భారతీయ రైల్వే పార్శిల్ సర్వీస్ అత్యంత చవకైన, సురక్షితమైన & అత్యంత నమ్మదగిన మార్గం.


ఇండియన్‌ రైల్వేస్‌, దేశవ్యాప్తంగా ప్రయాణీకులతో పాటు వివిధ వస్తువులను రవాణా చేయడానికి కూడా ఒక నమ్మకమైన మార్గం. రైలులో మోటర్‌ సైకిల్‌ను ఎలా పంపాలి, దానికి ఏ పత్రాలు అవసరం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి & మొత్తం మీద ఎంత ఖర్చవుతుంది అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బైక్ పంపడానికి రెండు ఆప్షన్లు
భారతీయ రైల్వేస్‌, మోటర్‌ సైకిల్‌ను తీసుకెళ్లడానికి రెండు ఎంపికలు అందిస్తోంది. మొదటి ఎంపిక… లగేజ్, దీనిలో ప్రయాణీకుడు ప్రయాణించేటప్పుడు తన బైక్‌ను తీసుకెళ్లవచ్చు. ఈ ప్రక్రియలో, బైక్ బుకింగ్ ప్రయాణీకుల టికెట్‌తో అనుసంధానిమై ఉంటుంది. రెండో ఎంపిక పార్శిల్, దీనిలో ప్రయాణీకుడు లేకుండా రైల్వే ద్వారా బైక్‌ను గమ్యస్థానానికి పంపుతారు. మీరు ప్రయాణం చేయకపోతే, పార్శిల్ ఆప్షన్‌ తీసుకోవడం మంచిది.

రైలులో బైకును పంపడం కష్టమైన విషయమే కాదు, సులభమే. ముందుగా, మీ సమీప రైల్వే స్టేషన్‌లోని పార్శిల్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఉన్న రైల్వే సిబ్బందిని అడిగి మొత్తం ప్రక్రియ & ఛార్జీల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

రైలులో బైకును పంపడానికి అవసరమైన పత్రాలు:

1. బైక్ RC (Registration certificate)

2. బీమా సంబంధిత పత్రాలు (Insurance documents)

3. మీ గుర్తింపు కార్డు కాపీ (ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి)

కచ్చితంగా గుర్తుంచుకోవాల్సి విషయం
బుకింగ్ సమయంలో బైక్ ఇంధన ట్యాంకు పూర్తిగా ఖాళీగా ఉండాలని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. రైల్వే ఉద్యోగులు బుకింగ్ సమయంలో మీ బండిని తనిఖీ చేస్తారు & పెట్రోల్ దొరికితే రూ. 1000 వరకు జరిమానా విధించవచ్చు.

ఇతర అవసరమైన జాగ్రత్తలు
బైక్ పంపడానికి కనీసం ఒక రోజు ముందు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బైక్‌ను సరిగ్గా ప్యాక్ చేయండి, ముఖ్యంగా హెడ్‌లైట్, సైడ్ మిర్రర్లు & పెళుసుగా ఉండే ఇతర భాగాలను జాగ్రత్తగా ప్యాక్‌ చేయండి. పార్శిల్ బుకింగ్ సమయం సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. బైక్ మీ పేరు మీద లేకపోయినా మీరు దానిని పార్శిల్‌ కోసం బుక్ చేసుకోవచ్చు.

బైక్ పంపడానికి ఎంత ఖర్చు అవుతుంది?
బైక్ పార్శిల్ ధర.. ప్రయాణ దూరం & బండి బరువుపై ఆధారపడి ఉంటుంది, ఎంత చెల్లించాలనేది కచ్చితంగా చెప్పలేం. రైల్వే పార్శిల్‌ ఆఫీస్‌లోనే కచ్చితమైన రుసుమును చెబుతారు. ఉదాహరణకు, మీరు బైక్‌ను 500 కి.మీ. దూరం పంపితే, దాని ప్రాథమిక ధర దాదాపు 1200 రూపాయలు అవుతుంది లేదా ఇంకా ఎక్కువ కావచ్చు. అంతేకాదు, బైకును ప్యాక్‌ చేయడానికి 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు విడిగా చెల్లించాల్సి రావచ్చు. మీరు ఒక నిర్దిష్ట రైలు లేదా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ఎంచుకుంటే అదనపు ఛార్జీలు కూడా యాడ్‌ చేస్తారు.

మీ బైకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్‌ పేపర్లు, మీ గుర్తింపు కార్డు జిరాక్స్‌ కాపీ లేకుండా రైల్వే ద్వారా బైకును పార్శిల్‌ చేయడం సాధ్యం కాదు. కాబట్టి, రవాణా తేదీకి ముందుగానే వీటిన్నింటినీ సిద్ధం చేసుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.