Hyderabad: ఇకపై హైదరాబాద్ టూ తిరుపతి ప్రయాణం.. రయ్.. రయ్‌మని దూసుకెళ్లిపోవచ్చు

తెలంగాణలో రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అంశంపై అధికారులకు కీలక సూచనలు చేయడంతో పాటు..


సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు సీఎం రేవంత్. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు.. సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రహదారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు.

రాష్ట్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతున్న రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు పలు ఇబ్బందులు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. ఆయా సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రహదారుల నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు ఈ భేటీలో పాల్గొంటారని, ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం సూచించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయి. వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున బందర్ పోర్టును అనుసంధానించేలా హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక హైదరాబాద్ -కల్వకుర్తి జాతీయ రహదారి నిర్మిస్తే తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. మన్నెగూడ రహదారి పనులనూ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సూచించారు.

కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని వారికి సూచించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్‌-విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను అధికారుల దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని అధికారులను సీఎం కోరారు.