చంద్రబాబును కలవాలంటే ముందుగా ఈ నెంబర్ కు కాల్ చేయండి..!!

చంద్రబాబును కలవాలంటే ముందుగా ఈ నెంబర్ కు కాల్ చేయండి..!!


ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్య ప్రజలను కలుస్తున్నారు. సీఎంకు తమ సమస్యలు చెప్పుకొనేందకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. వారి నుంచి సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా చంద్రబాబు ఆదేశాలు ఇస్తున్నారు.

అయితే..పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న వారి కారణంగా నిజంగా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. దీంతో, వారి కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను పార్టీ నేతలు ప్రకటించారు.

చంద్రబాబును కలిసేందుకు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ పార్టీ శ్రేణులతో పాటుగా ఇతరులు నేరుగా ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకొనేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వందల మంది చంద్రబాబును చుట్టుముట్టి వినతులు, పుష్పగుచ్ఛాలు ఇవ్వాలని చూడటంతో ఆయన కూడా కొద్దిసేపు తొక్కిసలాటలో చిక్కుకుపోయారు. దీనితో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పై అంతస్థుకు తీసుకువెళ్లారు. సెక్యూరిటీని తోసుకొని కొందరు సందర్శకులు అక్కడకు వెళ్లారు.

టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

తోపులాటలో బాగా ఇబ్బంది పడ్డామని, ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని కొందరు మహిళలు ఆయనతో చెప్పారు. ఆయన వారికి ఆమేరకు హామీ ఇచ్చారు. దీంతో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక ప్రకటన చేసారు. ఇకపై ముఖ్యమంత్రి ని కలిసి తమ సమస్యలు విన్నవించుకొనేవారు ముందుగా 7306299999 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు. వారి పిర్యాదులను పరిశీలించి, వారిని ప్రాధాన్యత క్రమంలో అనుమతిస్తామని వెల్లడించారు. ప్రతీ వారం 500 మంది వరకు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

వినతులకు ప్రాధాన్యత

కొత్త ప్రభుత్వం కావటంతో నేరుగా చంద్రబాబును కలిసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు…సామాన్యులు తరలి వస్తున్నారు. అందులో అనేక మంది చంద్రాబుతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీరి కారణంగా నిజంగా ముఖ్యమంత్రికి అర్జీలు ఇవ్వాలని వచ్చిన వారికి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిని గుర్తించిన పార్టీ యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు ద్వారా సమస్యలు చెప్పుకొనేందకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానం అమలు కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను పార్టీ ఏర్పాటు చేసింది.