India vs South Africa: అమ్మాయిలు అదుర్స్‌

అదిరే బ్యాటింగ్‌.. అత్యుత్తమ బౌలింగ్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి త్రిష గొంగడికి ఎదురే లేకపోయింది. బ్యాటుతో, బంతితో అంతా తానై త్రిష మరోసారి చెలరేగిన వేళ.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అదిరే ఆటతో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన మన అమ్మాయిల జట్టు.. ఆదివారం ఫైనల్లో 9వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఆఖరి సమరంలో త్రిష (3/15)కు తోడు వైష్ణవి శర్మ (2/23), పరుణిక (2/6), ఆయూషి (2/9) కూడా విజృంభించడంతో మొదట సఫారీ జట్టు 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లోనూ త్రిష (44 నాటౌట్‌; 33 బంతుల్లో 8×4) ముందుండి నడిపించడంతో లక్ష్యాన్ని భారత్‌ 11.2 ఓవర్లలో ఒకే వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఆమెకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. టోర్నీ ఆసాంతం అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న త్రిష ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డునూ సొంతం చేసుకుంది. ఆమె 309 పరుగులతో ప్రపంచకప్‌లో టాప్‌స్కోరర్‌గా నిలవడమే కాక ఏడు వికెట్లూ పడగొట్టింది.