ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది: ట్రంప్ పోస్టు

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ (Israel-Iran) యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి.


ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో మంగళవారం వేకువ జామున 3.32 (భారత కాలమానం) గంటలకు పోస్టు చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ రెండు దేశాలను అభినందించారు.

”అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్‌ కాల్పుల విరమణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందనే భావిస్తున్నాను. ఇందు కోసం నేను రెండు దేశాలను అభినందించాలనుకుంటున్నాను. ఈ యద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక ముందూ అలా జరగదు. ఇజ్రాయెల్, ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్యం, ప్రపంచ దేశాలతోపాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది” అని ట్రంప్‌ పేర్కొన్నారు.

శాంతివైపు అడుగులు వేయాలని..

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ బషరత్‌ అల్‌ ఫాత్‌’ పేరుతో ఇరాన్‌ (Iran) ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా ఇరాన్‌ తన పంథాను మార్చుకొని శాంతివైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.