గూగుల్ 15GB నిండిపోయిందా? ఈ 5 ఆప్షన్లు ట్రై చేయండి

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడేవారిలో నూటికి 90 శాతం మంది ఎదుర్కొనే సమస్య గూగుల్‌ స్టోరేజ్‌ ఫుల్‌ (Goole storage full).


మన ఫోన్లో తీసుకునే ఫొటోలు, వీడియోలతో ఉచితంగా లభించే స్టోరేజీ అయిపోతుంటుంది. గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌ వంటి గూగుల్‌ సర్వీసులన్నింటికీ ఈ 15 జీబీ స్టోరేజీనే ఆధారం. మరి ఈ స్టోరేజీ ఫుల్‌ అయితే మెయిల్స్‌ కూడా రాని పరిస్థితి. దీంతో అదనపు స్టోరేజీ కావాలంటే గూగుల్‌ వన్‌ (Google one) సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఐదు టిప్స్‌ పాటిస్తే.. ఏ చింతా లేకుండా ఫ్రీగానే 15జీబీ వాడుకోవచ్చు.

రివ్యూ అండ్‌ డిలీట్‌

మీ గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందని మెసేజ్‌ చూపిస్తే గూగుల్‌ వన్‌ స్టోరేజీ మేనేజర్‌కి వెళ్లండి. అక్కడ దేనికెంత స్టోరేజీ అవుతోందో చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద పెద్ద ఫైల్స్‌ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. ఎక్కువ స్టోరేజీని ఆక్రమించేవాటిలో గూగుల్‌ ఫొటోస్‌ సర్వీస్‌ ముందు వరుసలో ఉంటుంది. అందులో అవసరం లేని పెద్ద వీడియోలు, బ్లర్‌ అయిన ఇమేజ్‌లు, డూప్లికేట్‌ ఇమేజ్‌లు, స్క్రీన్‌షాట్‌లు డిలీట్‌ చేయండి. (వివిధ రకాల డిలీట్‌ ఆప్షన్ల కోసం)

కంప్రెస్‌ చేస్తే సగం ఖాళీ

గూగుల్ ఫొటోస్‌లో కంప్రెస్ చేయడం ద్వారా స్టోరేజీని సగం వరకు ఆదా చేయొచ్చు. ఇందుకోసం గూగుల్ ఫొటోస్‌లో అప్‌లోడ్‌ ”Storage Saver” మోడ్‌ను ఎంచుకొని ఫొటోలు, వీడియోలను కంప్రెస్ చేయొచ్చు. దీనివల్ల ఇమేజ్‌ నాణ్యత కాస్త తగ్గినా.. చాలావరకు స్టోరేజీ ఆదా అవుతుంది. ఇప్పటికే అప్‌లోడ్ చేసిన ఫొటోలను కంప్రెస్ చేయడం కోసం photos.google.comకి మీ ఇ-మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి. ఎడమవైపు సెట్టింగ్స్‌లో ”Recover storage” ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ”Compress existing photos and videos” ఎంచుకోండి. ఇప్పటికే అప్‌లోడ్ చేసిన ఫైళ్ల స్టోరేజీ నాణ్యతకు కంప్రెస్ చేస్తుంది. ఈ ప్రక్రియ ఒకసారి చేసిన తర్వాత ఫొటోలు ఒరిజినల్‌ క్వాలిటీకి రావడం కుదరదనేది గుర్తుంచుకోండి.

టేక్‌ ఔట్‌తో ఆల్‌క్లియర్‌

గూగుల్ ఫొటోస్‌లో ఫైళ్లను మీ కంప్యూటర్‌ లేదా ఇతర క్లౌడ్‌ స్టోరేజీ ప్లాట్‌ఫామ్‌ల్లో సేవ్‌ చేయడానికి గూగుల్‌ టేక్‌ఔట్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం takeout.google.comకి మీ మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వండి. అక్కడ చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. అన్నింటినీ డీ సెలక్ట్‌ చేసి గూగుల్ ఫొటోస్ ఆప్షన్‌ ఎంచుకోండి. తర్వాత ఎక్స్‌పోర్ట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫైల్‌ ఫార్మాట్‌, డెలివరీ పద్ధతుల్లో (ఉదా: Google Drive, ఇ-మెయిల్ లింక్, లేదా Dropbox) ఇ-మెయిల్‌ ఎంచుకోండి. ”Create export”పై క్లిక్‌ చేయండి. డేటా సైజ్ ఆధారంగా ఎక్స్‌పోర్ట్‌కు కొంత సమయం పడుతుంది. తర్వాత మెయిల్‌కు లింక్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే మీరు కోరుకున్నచోట (డెస్క్‌టాప్‌, ఇతర క్లౌడ్‌ స్టోరేజీ) ఆ జిప్‌ ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ అవుతాయి. అన్నీ ఎక్స్‌పోర్ట్ అయ్యాయో, లేదో చెక్‌ చేసుకొని పాత ఖాతా నుంచి ఫొటోలను డిలీట్ చేస్తే మళ్లీ మీకు చాలావరకు స్టోరేజీ లభిస్తుంది.

టెలికాం కంపెనీలందించే స్టోరేజీ

టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, జియో ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లపై క్లౌడ్‌ స్టోరేజీని అందిస్తున్నాయి. జియో ఎంపిక చేసిన ప్లాన్లపై 50 జీబీ వరకు ఉచిత క్లౌడ్‌ స్టోరేజీని అందిస్తోంది. ఎయిర్‌టెల్‌.. గూగుల్‌తో జట్టుకట్టి 100జీబీ క్లౌడ్‌ స్టోరేజీని ఆరు నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. ఆపై నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లార్జ్‌ ఫైల్స్‌, ముఖ్యమైన ఫైల్స్‌ను స్టోర్‌ చేసుకోవడానికి ఈ క్లౌడ్‌ స్టోరేజీని వినియోగించుకోవచ్చు. అయితే, బ్యాకప్‌/ రీస్టోర్‌ ప్రక్రియను సులువుగా పూర్తి చేయాలంటే మొబైల్‌ కంటే కూడా డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ వినియోగించడం మంచిది.

వేరే ఇ-మెయిల్

ప్రతిసారీ స్టోరేజీ నిండిపోవడం, దాంతో ముఖ్యమైన మెయిల్స్‌ ఆగిపోవడం వంటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఇ-మెయిల్‌ వాడుకోవడం మరో పద్ధతి. సెకండ్‌ ఇ-మెయిల్‌ ఐడీకి ఫొటోలు, వీడియోలు బ్యాకప్‌ చేసి.. మీరు రెగ్యులర్‌గా వాడే మెయిల్‌ను కేవలం మీ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటే స్టోరేజీ సమస్య తలెత్తదు.

మరికొన్ని టిప్స్‌

  • గూగుల్‌ ఫొటోస్‌ బ్యాకప్‌కి మీ కెమెరా ఫోల్డర్‌ను మాత్రమే జోడించండి. ఇతర ఫోల్డర్లు కూడా బ్యాకప్‌ చేస్తే త్వరగా స్టోరేజీ నిండిపోతుంది.
  • గూగుల్‌ స్టోరేజీ నిండిపోయినప్పుడే డిలీట్‌ చేయడం కంటే వీలుదొరికినప్పుడల్లా అవసరం లేనివి డిలీట్‌ చేయడం ప్రయోజనకరం.
  • ఎక్కువగా ఫొటోలు తీసేవారు గూగుల్‌ స్టోరేజీ త్వరగా నిండిపోతుందని భావిస్తే మాన్యువల్‌గా మీకు అవసరమైనవి మాత్రమే బ్యాకప్‌ చేయండి.
  • ముఖ్యమైన డాక్యుమెంట్లను గూగుల్‌ డ్రైవ్‌ కాకుండా ప్రభుత్వం అందిస్తున్న డిజీలాకర్‌ను ఉయోగించడం మంచి పద్ధతి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.