పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలివిడతగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు
తెలంగాణ రాష్ట్రప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. జూలై 14న కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తొలివిడతగా 2.4 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. దీంతో 11.30 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సబ్సిడీ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా కార్డులు పొందిన వారికి నాణ్యమైన బియ్యం, షుగర్, కిరాణా వస్తువులు తక్కువ ధరకు అందించనున్నారు. ఇదే సమయంలో పాత కార్డుల రివ్యూకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది.
రేవంత్, ఉత్తమ్ సంతకాలతో కొత్త కార్డులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతకాలతో కూడిన లేఖ రూపంలో కొత్త కార్డులు ఇస్తారు. కొంతకాలం తర్వాత పాతవారికి, కొత్తవారికి కొత్త రూపంలో రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాల సమాచారం. అయితే డిజైన్ ఖరారు కావాల్సి ఉంది.
దశలవారీగా రేషన్ కార్డుల పంపిణీ
ఒకవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయడంతో పాటు మరోవైపు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడం కూడా జరిగింది. దీని ఫలితంగా ఇప్పటి వరకు లబ్ధి పొందని అనేక మందికి లబ్ధి చేకూరనుంది. అయితే రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా పరిశీలిస్తోంది. ఆపై కలెక్టర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆమోదించిన దరఖాస్తులను డైనమిక్ కీ రిజిస్టర్ (DKR)లో నమోదు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
పేపర్ రూపంలోనే కార్డుల పంపిణీ
ఇదిలా ఉంటే క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే టెండర్ల ప్రక్రియలో ఒక సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అందులో జాప్యం జరిగింది. స్మార్ట్ కార్డు అంశం ఇంకా న్యాయస్థానం పరిధిలోనే ఉండటంతో ప్రస్తుతానికి పేపర్ రూపంలోనే ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. తెలంగాణలో మీ కొత్త రేషన్ కార్డు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు మీరు ఆన్‌లైన్‌లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.
మీ పేరు ఆన్‌లైన్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా!
పేరు నమోదు చేసుకోవాల్సిన వ్యక్తులు తొలుత తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో ఎడమవైపు కనిపించే ఆప్షన్లలో’FSC Search’ పై క్లిక్ చేయాలి.
అక్కడ ‘FSC Application Search’అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
‘మీ-సేవా అప్లికేషన్ సెర్చ్’ విండో ఓపెన్ అవుతుంది.
విండో ఓపెన్‌కాగానే మీ జిల్లాను ఎంచుకోవాలి. .
జిల్లాను ఎంచుకున్న తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీసేవా కేంద్రం ఇచ్చిన అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.
చివరగా’Search’బటన్ పై క్లిక్ చేయాలి.
సెర్చ్ బటన్ నొక్కిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ కింద డిస్‌ప్లే అవుతుంది.
దరఖాస్తు స్టేటస్‌లో మీ దరఖాస్తు Approved అయి ఉంటే కొత్త రేషన్ కార్డు వస్తుంది.
అప్రూవ్డ్ అయిన తర్వాత మీ రేషన్ దుకాణానికి వెళ్లి మీ ఆధార్ నంబర్ చెప్పి కొత్త రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.