జగన్‌కు ప్రతిపక్ష నేతగా అవకాశం లేదు

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని ఏపీ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.


బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్ రూల్స్ చదువుకోవాలని సూచించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే ఆయన కొనసాగుతారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలకు ఫ్లోర్ లీడర్లు ఉన్నారని తెలిపారు.

కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పట్టిందని గుర్తు చేశారు. జగన్‌కు కూడా ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. ”2014లో 44 సీట్లు వచ్చాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. 2019లో 54 సీట్లు వచ్చాయి. అప్పుడు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఫ్లోర్ లీడర్లుగా మాత్రమే కొనసాగారు. పదేళ్ల తర్వాత ఈరోజే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ విపక్ష హోదా దక్కింది. వైసీపీ కూడా ప్రతిపక్ష హోదా రావడానికి కచ్చితంగా 10 సంవత్సరాలు పడుతుంది. 2029లోనూ వైసీపీ ప్రతిపక్ష హోదా రాద”ని పయ్యావుల కేశవ్ అన్నారు.