తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటన ఫిక్స్..కల్ట్ చూపించే టైమ్ వచ్చింది

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.


ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తోన్నారు. దాని తరువాత తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్లనున్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. మాల ధారణ చేశారు. 11 రోజులపాటు నిష్ఠగా దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు.

దీక్షలో భాగంగా ఈ నెల 29వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. తమ ఇంటిదైవం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొక్కులు చెల్లించనున్నారు. ఇదివరకు ఇదే ఆలయాన్ని సందర్శించారాయన. వారాహి వాహనానికి పూజలు చేయించారు అప్పట్లో. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.

దీని తరువాత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటిస్తారు పవన్ కల్యాణ్. జులై 1వ తేదీన ఆయన పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 1వ తేదీన సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో ప్రసంగిస్తారు. కృతజ్ఞత సభను నిర్వహిస్తారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలను తెలియజేయనున్నారు.

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం, నియోజకవర్గ అభివృద్ధి, ఓటర్ల సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలను జారీ చేస్తారు. అలాగే- మూడు రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు.