జనసేన పార్టీ (Janasena Party)కి తెలంగాణ ఎన్నికల సంఘం (Telangana Election Commission) గుడ్ న్యూస్ చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా గుర్తించింది.
అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన (Janasena) తరఫున పోటీకి నిలిచే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని, అందుకు అనుగుణంగా తెలంగాణ (Telangana)లోనూ గుర్తించాలని, గాజుగ్లాసు గుర్తు ఇవ్వాలని ఇటీవల ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు అనుమతినిస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ (Ashok Kumar) ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, జనసేన పార్టీ (Janasena Party) తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఇప్పటికే ప్రకటించారు. అయితే జనసేన ప్రస్తుతం ఎన్డీఏ (NDA) కూటమిలో ఉంది. అయితే ప్రధానంగా ఏపీ వరకూ వారి పొత్తులు ఉన్నాయి. తెలంగాణ (Telangana)లో ఎవరితోనూ పొత్తులు ఉండవని కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇప్పటికే ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ కేడర్‌కు అవకాశాలు కల్పించాలని పవన్‌కల్యాణ్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ (Telangana)లో జనసేన పార్టీ కార్యకర్తలకు పెద్దగా అవకాశాలు కల్పించలేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఓ కారణంతో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఈసారి మాత్రం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. గుర్తు కూడా రిజర్వ్ కావడంతో తెలంగాణ జనసేన శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.