బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌పై హత్యాప్రయత్నం ఘటన భారతీయ సినిమా రంగాన్ని కుదిపేసింది. జనవరి 16వ తేదీన గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ అమానుష సంఘటనపై బాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
ఆయన ఆరోగ్యం గురించి స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషాద సంఘటన నేపథ్యంలో ఆయన సతీమణి కరీనా కపూర్, హీరో టీమ్ ఓ ప్రకటన జారీ చేసింది. వారి వివరణ వివరాల్లోకి వెళితే..
సైఫ్ కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 2.30 సమయంలో అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. అతడిని గమనించిన పనిమనిషి అతడిని వారించేందుకు ప్రయత్నించారు. దాంతో పనిమనిషితో అగంతకుడు వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అలికిడి విన్న సైఫ్ వచ్చి.. అతడిని వారించేందుకు ప్రయత్నించాడు. దాంతో సైఫ్‌పై అతడు దాడి చేశాడు. ఈ దాడిలో దాదాపు ఆరు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆయనను 3.30 గంటల ప్రాంతంలో హాస్పిటల్‌లో చేర్పించారు అని తెలిపారు.
లీలావతి హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ నీరజ్ ఉత్తమని మెడికల్ బులెటిన్ జారీ చేసి సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా స్పందించాడు. సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. ముఖ్యంగా వెన్నుముక ప్రాంతంలో తీవ్రమైన కత్తిపోటును గుర్తించాం. ఆయన శరీరంపై రెండు చోట్ల లోతుగా బలమైన గాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు సర్జరీ నిర్వహిస్తున్నాం. వైద్యుల బృందం మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నది అని తెలిపారు.
అయితే సైఫ్ ఆలీ ఖాన్‌పై అమానుష దాడి ఘటనపై ఆయన పీఆర్, కరీనా వ్యక్తిగత సిబ్బంది అధికారికంగా స్పందించారు. ఇంట్లోకి దొంగతనానికి చొరబడిన వ్యక్తి సైఫ్ ఆలీ ఖాన్‌పై ఆయన నివాసంలో దాడి చేశారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నాం. వైద్యులు సర్జరీ నిర్వహిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతున్నది. ఈ ఘటనపై మరిన్నీ వివరాలు త్వరలోనే మీకు అందిస్తాం అని టీమ్ వెల్లడించింది.
అయితే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. సర్జరీ చేసి మెరుగైన చికిత్సను అందించే పనిలో నిమగ్నమయ్యాం. ఆపరేషన్ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటనే విషయంపై క్లారిటీ ఇస్తాం. అప్పటి వరకు హెల్త్ బులెటిన్‌ను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని మీడియాకు, అభిమానులకు అందిస్తాం అని తెలిపారు.