వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వైఎస్ఆర్ కడపగా జిల్లా పేరు మార్చాలని నిర్ణయించింది.
సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలుపుతూ కెబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించనున్నారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరు ఉండేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరులోని కడప తొలగించింది. దీంతో నాటి నుంచి వైఎస్ఆర్ జిల్లాగా వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పని చేశారు. అయితే రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009,సెప్టెంబర్ 2వ తేదీన హెలికాఫ్టరు దుర్ఘటనలో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం.. వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత, వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు.
దీంతో ప్రభుత్వం చేపట్టిన పథకాలకే కాదు.. పలు సంస్థలకు సైతం వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరును మార్చారు. అందులోని కడపను తీసి వేశారు. దీంతో వైఎస్ఆర్ జిల్లాగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం సోమవారం జరిగిన కేబినెట్‌లో వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి కడప జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నో శతాబ్దాల పాటు కడప జిల్లా పేరు మనుగడలో ఉంది. అలాంటి పేరును తొలగించి.. కేవలం వైఎస్ఆర్ పేరు మాత్రమే ఉండడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.