ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు కేఎల్‌ రాహుల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు కేఎల్‌ రాహుల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. రాహుల్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించాడని సమాచారం.


కెప్టెన్సీ చేపట్టే విషయంలో డీసీ యాజమాన్యం రాహుల్‌ను సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని రాహుల్‌ మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేశాడట. దీంతో డీసీ యాజమాన్యం అక్షర్‌ పటేల్‌ పేరును కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు సమాచారం.

ఇవాళో రేపో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ సక్సెస్‌ అనంతరం డీసీ మేనేజ్‌మెంట్‌ అక్షర్‌ విషయంలో చాలా హ్యాపీగా ఉందని తెలుస్తుంది. అక్షర్‌ను డీసీ మేనేజ్‌మెంట్‌ మెగా వేలానికి ముందు రూ. 16.5 కోట్లకు రీటైన్‌ చేసుకుంది.

కేఎల్‌ రాహుల్‌ను మెగా వేలంలో రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్‌కు టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో పంజాబ్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండగా.. అక్షర్‌ కెప్టెన్‌గా ఎంపికైతే ఇదే అతనికి ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా తొలి అసైన్‌మెంట్‌ అవుతుంది. అక్షర్‌కు దేశవాలీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో గుజరాత్‌ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది.

అక్షర్‌ గత సీజన్‌లో రిషబ్‌ పంత్‌ అందుబాటులో లేనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. అక్షర్‌ 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కొనసాగుతున్నాడు. అక్షర్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 150 మ్యాచ్‌లు ఆడి 1653 పరుగులు, 123 వికెట్లు తీశాడు. అక్షర్‌ బ్యాటింగ్‌ స్ట్రయిక్‌రేట్‌ 130.88గా ఉండగా.. బౌలింగ్‌ ఎకానమీ 7.28గా ఉంది. అక్షర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా కూడా పని చేశాడు.

కాగా, గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా ఉన్న రిషబ్‌ పంత్‌ను ఢిల్లీ వదిలేసుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో పాల్గొన్న పంత్‌ను లక్నో రికార్డు ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది.

పలు మ్యాచ్‌లకు దూరం కానున్న రాహుల్‌..?
ఐపీఎల్‌ 2025 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానుండగా.. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. వైజాగ్‌లో జరిగే పోరులో ఢిల్లీ..లక్నోతో తలపడనుంది. కాగా, ఈ సీజన్‌లో తొలి రెండు, మూడు మ్యాచ్‌లకు కేఎల్‌ రాహుల్‌ దూరం కానున్నాడని తెలుస్తుంది.

రాహుల్‌ భార్య అతియా శెట్టి త్వరలో బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం. ఈ కారణంగానే రాహుల్‌ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌ వద్ద పర్మిషన్‌ తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. రాహుల్‌-అతియాల వివాహాం 2023 జనవరిలో జరిగింది. ఈ జంట గతేడాది నవంబర్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని బహిర్గతం చేసింది.

2025 ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఢిల్లీ జట్టు..
ఫాఫ్‌ డుప్లెసిస్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, అషుతోష్‌ శర్మ, విప్రాజ్‌ నిగమ్‌, దర్శన్‌ నల్కండే, అజయ్‌ జాదవ్‌ మండల్‌, త్రిపురణ విజయ్‌, అక్షర్‌ పటేల్‌, మన్వంత్‌ కుమార్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అభిషేక్‌ పోరెల్‌, డొనొవన్‌ ఫెరియెరా, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దుష్మంత చమీరా, మిచెల్‌ స్టార్క్‌, మోహిత్‌ శర్మ, టి నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌