KTR: మరికాసేపట్లో ఈడీ ముందుకు కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) మరికాసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరు కానున్నారు. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరుకావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్‌ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. ఫార్ములా-ఈరేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది.


దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్ణణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ఈడీ విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను సైతం బుధవారం ‘డిస్మిస్డ్‌ యాజ్‌ విత్‌డ్రాన్‌’గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.