ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి డోలా బాల వీరాంజయనేయస్వామితో చర్చించారు. ఇందులో వారు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరారు. సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంటు పేస్కేల్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవాళ మంత్రితో జరిగిన భేటీలో ఉద్యోగ సంఘాలు పలు డిమాండ్లు ఆయన ముందు పెట్టాయి. ఇందులో వివిధ కేటగిరీల సచివాలయం ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సర్వీస్ మాటర్స్ విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల హేతు బద్ధీకరణ ప్రక్రియలో ఇచ్చిన జిఓ.యం.యస్.నెం1 క్లాస్ 3.ఏ లో చెప్పిన విధంగా మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ , యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఎవరెవరు ఏ కేటగిరీ కింద వస్తారో పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు.
అలాగే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో 3501 పై పడి జనాభా ఉన్న సచివాలయాలకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున, 3501 జనాభా దాటి పెరిగే ప్రతి 500 లేదా 1000 మంది జనాభా కు అదనంగా ఒక సచివాలయ ఉద్యోగిని ఇవ్వాలని కూడా ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే వివిధ హోదాలలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులలో.. ఎంతమందిని మల్టీపర్పస్, టెక్నికల్ (6 లేదా 7 లేదా 8 క్యాటగిరి కి సంబంధించిన సచివాలయాలలో) ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారో ఉద్యోగులకు తేలియచేయాలని కోరారు.
మరోవైపు 2023 సంవత్సరంలో కేంద్రం ప్రకటించిన ఆస్పిరేషన్ బ్లాక్స్, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంకు అనుబంధంగా కొత్తగా ఇప్పుడు ఆస్పిరేషన్ ఫంక్షనరీస్ క్రింద తీసుకుంటున్నారా అనే విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఒకవేళ అటువంటి ఉద్దేశం ఉంటే ఈ ఆస్పిరేషన్ సెక్రటరీ అని పిలవడానికి బదులు “ప్రోగ్రెసివ్ సెక్రటరీగా” పిలిస్తే బాగుంటుందని సూచించారు. సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే తమ సంవత్సరాంత ఇంక్రిమెంట్లతో జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ చేరువలో ఉన్నందున, వారందరికీ అదే పే స్కేల్స్ ఇస్తే ప్రభుత్వంపై ఎలాంటి అధిక భారం కలగదు కనుక దీన్ని కూడా పరిశీలించాలన్నారు.