ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో గురువారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
దక్షిణ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల సంచారంపై సమాచారం అందడంతో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల డీఆర్జీ, కోబ్రా 204, 205, 206, 208, 210తో పాటు సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లు సంయుక్తంగా భారీఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మరణించిన నాలుగు రోజులకే తాజా ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం బయటకు వచ్చినప్పుడు అడవిలో కాల్పులు ప్రారంభమయ్యాయి.
పోలీసు బృందంలో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRF), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), జిల్లా బలగాల సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. జనవరి 4న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మరణించారు.
మరోవైపు, బీజాపూర్ జిల్లాలో భాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుత్కేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.