Gaganyaan Astronauts Name : భారత వ్యోమగాములు అంతరిక్షంలోకి అడుగుపెట్టే చారిత్రక ఘట్టానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో గగన్ యాన్ వ్యోమగాములను ఇస్రో ప్రపంచం ముందుంచింది. గగన్ యాన్ కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల బృందాన్ని ప్రకటించింది. గగన్ యాన్ ప్రాజెక్ట్ పురోగతిపై ప్రధాని మోదీ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. వీరంతా వేరేవేరే ఇస్రో కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. ఈ నలుగురు వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించారు. అయితే, రష్యారాకెట్ లో ఆయన అంతరిక్షంలోకి వెళ్లాడు. ఇప్పుడు నలుగురు భారతీయులు మనదేశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరే రాకెట్లో ప్రయాణించి అంతరిక్షంలో అడుగు పెట్టనున్నారు. ఈ నలుగురు వ్యోమగాములు భారతదేశంలోని అన్ని రకాల యుద్ధ విమానాలను నడిపారు. అందువల్ల, యుద్ధ విమానాల లోపాలు, ప్రత్యేకతలు వీరు అవపోసన పట్టారు. వీరంతా రష్యాలోని జియోగ్నీ నగరంలో ఉన్న రష్యన్ స్పేస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ తీసుకుంటున్నారు.
సెలక్షన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) గగన్ యాన్ మిషన్ కోసం వ్యోమగాములను ఎంపిక చేయడానికి ట్రయల్స్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా వందలాది మంది పైలట్లు ఇందులో అర్హత సాధించారు. వీరిలో టాప్ 12 మంది ఎంపికయ్యారు. అనేక రకాల రౌండ్ల తరువాత ఈ మిషన్ కోసం నలుగురు ఎయిర్ ఫోర్స్ పైలట్లను ఎంపిక చేశారు. వీరి శిక్షణ 2021లో పూర్తయింది. ఈ పైలట్లు రష్యాలో అనేక రకాల శిక్షణలు తీసుకున్నారు. ప్రస్తుతం వీరు బెంగళూరులో ఉన్న ఇస్రో హ్యూమన్ స్పేస్ సెంటర్ (హెచ్‌ఎస్‌ఎఫ్‌సి)లో సాధన చేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై కూడా శ్రద్ధ చూపుతున్నారు. అయితే, గగన్ యాన్ మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగించే సమయంలో ముగ్గురు వ్యోమగాములను మాత్రమే పంపించనున్నారు.
#ISRO reveals the identities of the four astronaut designates for #Gaganyaan's first crewed mission! 👨🚀
• Group Captain Prashanth BalaKrishnan Nair
• Group Captain Ajit Krishnan
• Group Captain Angad Prathap
• Wing Commander Shubhansku Shukla🇮🇳🇮🇳🇮🇳pic.twitter.com/08bLavQxBT
— ISRO Spaceflight (@ISROSpaceflight) February 27, 2024
గగన్ యాన్ మిషన్ కింద ముగ్గురు వ్యోమగాములను 400 కిలో మీటర్ల దూరంలోని దిగువ భూకక్ష్యలోకి మూడు రోజులపాటు పంపనున్నారు. ఆ తరువాత వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఇందుకో్సం క్రూ మాడ్యూల్ రాకెట్ ను ఉపయోగించనున్నారు. ఈ మిషన్ భారతదేశానికి చాలా ముఖ్యమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే అమెరికా, చైనా, రష్యా తరువాత మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహించిన నాల్గో దేశంగా భారత్ అవతరిస్తుంది.