సాధారణంగా మనం ఎవరి దగ్గర నైనా అప్పు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రామిసరీ నోట్ అనేది వాడతాం. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో అప్పుగా ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్య సెక్యూరిటీ కోసం రాయించుకునే దాన్ని ప్రామిసరీ నోట్ అంటారని ప్రముఖ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి అన్నారు.
లా ప్రకారం సెక్షన్ 4 ప్రకారం ప్రామిసరీ నోటు గురించి పూర్తిగా వివరాలు ఉంటాయి.
ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అప్పు తీసుకొని మళ్లీ మీ డబ్బులు నీకు చెల్లిస్తాను అనే దాని కోసమే ఈ నోట్ అనేది సాక్ష్యంగా ఉంటుంది. ఇదే కాకుండా కొంత మంది అప్పు ఇచ్చేటప్పుడు చెక్ కూడా తీసుకుంటారు. అయితే ప్రామిసరీ నోటును మనం క్లియర్‌గా రాస్తేనే ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా లీగల్‌గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. కాబట్టి ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్లాంక్‌ను పూర్తిగా రాయాలి. ఇందులో ఎవరు ఇస్తున్నారు, ఇందులో ఎవరు తీసుకుంటున్నారు, దానికి ఇంట్రెస్ట్ ఎంత.. అలాంటి ఖాళీలు అన్ని పూర్తిగా రాయాలి. దీని తర్వాత ప్రామిసరీ నోటు కింద సిగ్నేచర్ భాగంలో ఎవరైతే డబ్బు అప్పుగా తీసుకుంటున్నారో వారు సంతకం చేయవలసి ఉంటుంది. ఆ సిగ్నేచర్ కూడా తప్పనిసరిగా రెవెన్యూ స్టాంపు పైనే చేయాల్సి ఉంటుంది.
అదెలా అంటే రూ.1 రెవెన్యూ స్టాంప్ 2 తీసుకొని దానికి అతికించాలి. అందులో అప్పు తీసుకున్న వ్యక్తి సగం సంతకం ప్రామిసరీ నోటు మీద సగం సంతకం రెవెన్యూ స్టాంప్ మీదికి వెళ్లేటట్టు సిగ్నేచర్ చేయాలని సీనియర్ న్యాయవాది మహేందర్ తెలిపారు. అలాగే ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా మరో ఇద్దరు వ్యక్తుల సాక్షి సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విట్నెస్ సంతకాలు పెట్టేవారు మైనర్లు అయి ఉండకూడదు. అలాగే ఈ ప్రామిసరీ నోటు కు వ్యాలిడిటీ ఏమైనా ఉంటుందా అనే ప్రశ్న మీ మదిలో కలగవచ్చు. ఈ డాక్యుమెంట్ మనం కోర్టు లో వెయ్యాలి అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. యాక్ట్ ప్రకారం చూస్తే మూడు సంవత్సరాల వ్యాలిడిటీ ఒక డాక్యుమెంట్ కు ఉంటుంది. ఈ విధంగా ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు.