న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల తయారీదారులు 2024లో కిరాణా వస్తువుల ధరలను 2–-4శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, అధిక వేతన ఖర్చుల కారణంగా ధరలు పెంపు అనివార్యంగా మారిందని ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు చెబుతున్నాయి. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, ఇమామీ వంటి కంపెనీలు ధరల ఆధారిత వృద్ధి పరిశ్రమకు తిరిగి వస్తుందని చెప్పాయి. మనదేశపు అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ కూడా కొంత పెరుగుదలని ఆశిస్తోంది.
డాబర్ తన ఫుడ్ పోర్ట్‌ఫోలియో ధరలను ఇది వరకే 2.5శాతం పెంచినట్లు తెలిపింది. అయితే ఇమామీ ఈ సంవత్సరం సుమారు 3 శాతం వరకు ధరల పెంపుదలని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఎఫ్ఎంసీజీ వృద్ధి రికవరీకి అమ్మకాలతో పాటు ధరల పెరుగుదల కీలకమని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌పుట్ ధరలలో ప్రతి ద్రవ్యోల్బణం కారణంగా గత సంవత్సరం చాలా కంపెనీలు ఇబ్బందిపడ్డాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీల వృద్ధిలో దాదాపు 65-–70శాతం వాల్యూమ్ నుంచి, మిగిలినవి ధరల నుంచి వస్తుంది. తృణధాన్యాలు, మసాలాలు, తేనె వంటి ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెల ధరలు మాత్రం దిగివచ్చాయి.