క్రికెట్ మ్యాచ్ సమయంలో బౌండరీ వద్ద ఆటగాళ్లు అద్భుతమైన క్యాచ్‌లు (Boundary Catches) పట్టడం చూస్తాం. క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ సూర్యకుమార్ యాదవ్ T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ గుర్తుండే ఉంటుంది.
ఈ క్యాచ్ టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు అలాంటి క్యాచ్‌లకు సంబంధించి MCC (మేరీలెబోన్ క్రికెట్ క్లబ్) ఒక పెద్ద మార్పు చేసింది. అంతేకాకుండా, రిలే క్యాచ్‌లలో కూడా మార్పులు చేయబడ్డాయి.
మైకెల్ నెసర్ క్యాచ్‌పై వివాదం
ఇప్పటివరకు ఒక ఫీల్డర్ బౌండరీ రోప్ వెలుపల నుంచి గాలిలో బంతిని పలుమార్లు ఎగరవేసి, లోపలికి వచ్చి క్యాచ్ పట్టగలిగేవాడు. దాన్ని చెల్లుబాటైన క్యాచ్‌గా భావించి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసేవారు. బిగ్ బాష్ లీగ్ 2023-24లో ఒక మ్యాచ్‌లో ఇలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో మైకెల్ నెసర్ అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ నుంచి చాలా లోపలికి వచ్చి గాలిలో రెండుసార్లు బంతిని ఎగరవేసి క్యాచ్ పట్టాడు. దీని తర్వాత బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేశారు, కానీ ఈ క్యాచ్‌పై చాలా వివాదం జరిగింది.
బౌండరీ క్యాచ్‌లో ఇప్పుడు ఈ మార్పు
MCC నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఒక ఫీల్డర్ బౌండరీ రోప్ వెలుపల ఉన్నప్పుడు బంతిని కేవలం ఒక్కసారి మాత్రమే తాకగలడు. ఆ తర్వా, క్యాచ్‌ను పూర్తి చేయడానికి ఫీల్డర్ బౌండరీ లోపలికి తిరిగి రావాలి. అంతేకాకుండా MCC రిలే క్యాచ్‌లలో కూడా మార్పులు చేసింది. చాలాసార్లు ఫీల్డర్ బౌండరీ లోపల పడిపోతున్నప్పుడు పడిపోయే ముందు దగ్గరలో ఉన్న ఫీల్డర్‌కు బంతిని అందజేస్తాడు. కొత్త నియమం ప్రకారం.. బంతిని లాబ్ చేసే ఫీల్డర్, తన జట్టు సహచరుడు క్యాచ్ పట్టే సమయంలో బౌండరీ లోపల ఉండాలి. ఒకవేళ ఫీల్డర్ లైన్ వెలుపల ఉంటే అది బ్యాటింగ్ జట్టుకు బౌండరీగా పరిగణించబడుతుంది. ఈ నియమాలను ఐసీసీ కూడా అమల్లోకి తేనున్నట్లు సమాచారం.