Ev Trend: ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీపై కొత్త రూల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

www.mannamweb.com


దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ప్రోత్సాహకాలను మరింత స్థిరంగా చేసే లక్ష్యంతో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) పథకం కింద కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీలను అందిస్తోంది. అయితే ఫేమ్-2 పథకం కింద సబ్సిడీని లెక్కించే విధానాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా మార్చింది.

వెహికల్స్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. అందుకే సబ్సిడీలకు ఎక్స్-షోరూమ్ ధరలను ఉపయోగించకూడదని నిర్ణయించారు. ఇప్పుడు ప్రోత్సాహకాలు ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు, ఇ-త్రీ వీలర్ల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలపై ఆధారపడి ఉంటాయి. అంటే GST, సరకు రవాణా, డీలర్ మార్జిన్‌లు వంటి అంశాలు ఇకపై సబ్సిడీ కాలిక్యులేషన్‌లో భాగం కావు.

తక్షణమే అమల్లోకి రూల్స్
శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులు ప్రకటించారు. ఈ నిర్ణయం అన్ని తాజా విక్రయాలకు తక్షణమే అమల్లోకి వస్తుందని భారీ పరిశ్రమల అదనపు కార్యదర్శి డాక్టర్ హనీఫ్ ఖురేషి ఫైనాన్షియల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ‘లైవ్‌ మింట్‌’తో తెలిపారు. పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లో అన్ని వాహన విభాగాలను ప్రామాణీకరించడం, రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసాలను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సర్దుబాటు, ద్విచక్ర వాహనాల కోసం ఎక్స్-ఫ్యాక్టరీ ధరల ఆధారంగా ప్రోత్సాహకాలను లెక్కించడానికి 2023లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉంటుందని ఖురేషి చెప్పారు.

అదనంగా రూ.1,500 కోట్లు కేటాయింపు

అయితే ఈ మార్పు టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరెర్స్‌(OEMs) సబ్సిడీల్లో తగ్గింపుకు దారితీయవచ్చు. ఎందుకంటే క్లెయిమ్ చేసిన ప్రోత్సాహకాల పరిధి ఇప్పుడు ఎక్స్-ఫ్యాక్టరీ ధరలపై ఆధారపడి ఉంటుంది.

ధరల ప్రమాణాల్లో ఆకస్మిక మార్పు కారణంగా అమ్మకాల్లో అంతరాయాలు ఏర్పడవచ్చనే ఆందోళనలకు ప్రతిస్పందనగా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ FAME-II స్కీమ్ వ్యయం కోసం అదనంగా రూ.1,500 కోట్ల నిధులను ఆమోదించింది. మార్చి 31న స్కీమ్ ముగియడానికి ముందు, ఈ కేటాయింపుల ప్రకటన రావడం విశేషం.

నిపుణుల ఆందోళనలు

అదనపు నిధులు ఉన్నప్పటికీ, కొంతమంది పరిశ్రమ నిపుణులు ‘లైవ్‌ మింట్‌’తో కొత్త మార్పుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 9 నుంచి రిజిస్టర్ చేసిన వాహనాలపై కొత్త ఎక్స్-ఫ్యాక్టరీ ధర ప్రమాణాలు వర్తిస్తాయో లేదో నోటిఫికేషన్ స్పష్టం చేయలేదని చెప్పారు. చాలా మంది డీలర్లు కొంత సబ్సిడీ మొత్తాన్ని ఊహించి వాహనాలకు బిల్లు పెట్టారు కాబట్టి, క్లెయిమ్ చేయగల మొత్తంలో ఏదైనా మార్పు వస్తే మళ్లీ లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు.

FAME-II అంటే ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ (హైబ్రిడ్ &) ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్‌ ఇండియా ఫేస్‌ II. ఈ పథకాన్ని దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం, తయారీని పెంచే లక్ష్యంతో 2019 ఏప్రిల్‌లో ప్రభుత్వం లాంచ్‌ చేసింది. సవరించిన పథకం ప్రకారం.. ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు ప్రోత్సాహకాలు బ్యాటరీ సామర్థ్యాలతో ముడిపడి ఉంటాయి. వాహనం ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 20 శాతం పరిమితి ఉంటుంది. ఈ ఖర్చు అదనపు రిటైల్ ఖర్చులను మినహాయిస్తుంది.